- నీ తమ్ముని మీద కేసుపెట్టి.. చట్టం అందరికీ సమానమని చెప్పు
- రేవంత్ ఎంతో మంది కాంగ్రెస్ సీనియర్లను తొక్కుకుంటూ వచ్చి సీఎం అయిండు
- ఎస్‍ఎస్‍ఏ ఉద్యోగులకు ఇచ్చిన హామీని మరిచిండు
- మాజీ మంత్రి హరీశ్‌రావు
వరంగల్/మెదక్, వెలుగు : చట్టం విషయంలో అల్లు అర్జున్కు ఓ న్యాయం.. సీఎం తమ్మునికో న్యాయమా ? అంటూ మాజీమంత్రి, బీఆర్‍ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు సీఎం రేవంత్‍రెడ్డిని ప్రశ్నించారు. సోమవారం గ్రేటర్ వరంగల్‌లో పర్యటించిన ఆయన మొదట హనుమకొండ ఏకశిల పార్క్ వద్ద దీక్ష చేస్తున్న ఎస్‍ఎస్‍ఏ ఉద్యోగుల మద్దతు తెలిపి.. రేవంత్‍రెడ్డి ఎస్‍ఎస్‍ఏ ఉద్యోగులకు ఇచ్చిన హామీని మర్చిపోయాడని విమర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..
‘సీఎం రేవంత్‍రెడ్డి ఓ సినిమా యాక్టర్ కోసం జోరుగా మాట్లాడుతుండు.. రేవంత్‍రెడ్డి అన్నదమ్ములు పెడ్తున్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ చనిపోయిండు.. మరి నీ తమ్మున్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, అల్లు అర్జున్‌ను అరెస్ట్‌చేసిన నువ్వు.. నీ తమ్ముడు తిరుపతిరెడ్డిని అరెస్ట్‌చేసి నేను అందరికీ సమానమే అంటే ఎవరైనా నమ్ముతరు.
చట్టం నీ తమ్మునికో సుట్టం అయితది.. మరొకరికేమో ఇంకోటైతదా’ అని ప్రశ్నించారు. రేవంత్‍రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేతలను తొక్కుకుంటూ వచ్చి దొడ్డిదారిన సీఎం అయిండని విమర్శించారు. కేసీఆర్‍ను తిట్టుడు..ఎంక్వైరీలు చేయడం తప్పించి ఆయన ఏం చేయలేదన్నారు.
హస్పిటల్ పనుల్లో అవినీతి ఉంటే ఎంక్వైరీ చేస్కో
వరంగల్ పాత సెంట్రల్ జైల్ ఆవరణలో నిర్మిస్తున్న 24 అంతస్తుల హస్పిటల్ పనులను మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‍భాస్కర్, పెద్ది సుదర్శన్‍రెడ్డి, నన్నపునేని నరేందర్‍తో కలిసి హరీశ్‌రావు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జైపూర్‍లో కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లట్ 110 మీటర్ల ఎత్తులో హాస్పిటల్ కడితే ఒప్పు కానీ వరంగల్‌లో 91 మీటర్లతో కడితే తప్పా అని ప్రశ్నించారు. హాస్పిటల్ నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని, అవసరమైతే ఎంక్వైరీ చేసుకోవాలని సవాల్ చేశారు.
రైతుబంధును బొందపెట్టేందుకు కుట్ర
రైతుబంధు పథకాన్ని బొందపెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మెదక్ బీఆర్‌ఎస్ ఆఫీస్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. రైతుబంధు విషయంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లను ఎక్కడికక్కడ నిలదీయాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పంద్రాగస్టు వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తానని ఏడుపాయల దుర్గమ్మ, మెదక్ చర్చి మీద ఒట్టేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు మాట తప్పారన్నారు. హామీ నెరవేర్చని రేవంత్‌రెడ్డి ఏడుపాయల అమ్మవారి దగ్గర ముక్కు నేలకు రాసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు.
‘ఇద్దరం కలిసి గన్‌మెన్లు లేకుండా ఏదైనా ఒక ఊరికి పోదాం.. రైతులందరికీ రుణమాఫీ అయ్యిందంటే.. నేను ముక్కు నేలకు రాస్తా.. కాలేదంటే నువ్వు ముక్కు నేలకు రాస్తావా’ అని సీఎంకు సవాల్ విసిరారు. అనంతరం మెదక్ కలెక్టరేట్ వద్ద ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు హరీశ్‌రావు సంఘీభావం ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్య కంటే అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు.