హైదరాబాద్: ఇచ్చిన హామీలు అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మీ పాలనలో వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్న దుస్థితి వచ్చిందన్నారు. కుర్చీ కాపాడుకోవడం కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టడం, విదేశాలకు వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామనే డబ్బా ప్రచారం చేసుకోవడం మానేసి పాలనపై దృష్టి సారించాలని సూచించారు.
ALSO READ | రేషన్ కార్డులపై గుడ్ న్యూస్.. లిస్ట్‌లో పేరు లేనివాళ్లు మళ్లీ అప్లై చేసుకోవచ్చు
ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని అధి కారంలోకి వచ్చిన మీకు చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరం. 4 నెలలుగా పంచాయతీ కార్మికులు, మూడు నెలలుగా ఎమ్ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులు, నెల గడిచినా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు అందక వెతలుపడుతున్నారు. ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓలు ఇలా వేల మంది చిరు ఉద్యోగులు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నరు. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం. ఇప్పటికైనా చిరు ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు చెల్లించాలి' అని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు హరీశ్ .