హైదరాబాద్, వెలుగు: ఇచ్చిన హామీలు అమలు చేయలేక సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. తమ నేత కేటీఆర్ పై సీఎం రేవంత్ అక్రమంగా కేసు బనాయించారని మండిపడ్డారు. కేటీఆర్ ను అరెస్టు చేయకూడదని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
కేటీఆర్ తొలి అడుగులోనే నైతిక విజయం సాధించారని పేర్కొన్నారు. ఇది డొల్ల కేసని హైకోర్టు ఉత్తర్వులతో తేటతెల్లమైందని చెప్పారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణతో హైదరాబాద్ కు మేలు జరిగిందని 2022లో నీల్సన్ అనే ప్రఖ్యాత సంస్థ చెప్పిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాటలు శుద్ధ అబద్ధమని, రాష్ట్ర ఇమేజ్ ని దెబ్బతీశారని ఆరోపించారు.