ప్రభాకర్ రావును కలిసినట్టు నిరూపిస్తే.. గన్​పార్క్​లో ముక్కు నేలకు రాస్తా: హరీష్ రావు 

ప్రభాకర్ రావును కలిసినట్టు నిరూపిస్తే.. గన్​పార్క్​లో ముక్కు నేలకు రాస్తా: హరీష్ రావు 
  • లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పి నువ్వు రాస్తవా? 
     
    మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హరీశ్ రావు సవాల్

హైదరాబాద్, వెలుగు: ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లిన మాట నిజమేనని, కానీ అక్కడ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కలిసినట్టు జరుగుతున్న ప్రచా రంలో వాస్తవం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘నేను అమెరికాలో ప్రభా కర్ రావును కలిశానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

ఒకవేళ నేను ప్రభాకర్ రావును కలిసినట్టు వెంకట్ రెడ్డి నిరూపిస్తే.. గన్ పార్క్​లోని అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాస్తాను. లేదంటే వెంకట్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలి” అని సవాల్ విసిరారు. ఈ మేరకు హరీశ్ రావు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ‘‘నేను ఏ దేశం వెళ్లాను? ఏ హోటల్‌‌లో ఉన్నాను? లాంటి వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.

పాస్‌‌పోర్ట్‌‌తో సహా ఇతర వివరాలు తీసుకుని బహిరంగ చర్చకు వస్తాను. పాస్‌‌పోర్టులో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయి. కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతున్న తీరు ఆయన చౌకబారుతనానికి నిదర్శనం. కోమటిరెడ్డి దగ్గర ఉన్న అన్ని ఆధారాలతో రావాలి. లేకపోతే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి” అని అందులో డిమాండ్ చేశారు.  

పాకిస్తాన్ తో పోల్చడం సీఎంకు సంస్కారానికి నిదర్శనం

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తే పాకిస్తాన్ స్వాతంత్ర్య వేడుకలతో పోల్చడం సీఎం రేవంత్ రెడ్డి కుసంస్కారానికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనమని హరీశ్​రావు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారికి, తెలంగాణ గడ్డ మీద ప్రేమ ఉన్న వారికి రాష్ట్ర అవతరణ ప్రాముఖ్యత అర్థమవుతుంది అని అన్నారు.