ప్రతి పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆ సంకల్పంతోనే వరంగల్లో 24 అంతస్థుల భారీ ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు చెప్పారు. వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. రూ.1100 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం 2023 చివరి కల్లా పూర్తవుతుందని చెప్పారు. అయితే ఆస్పత్రి నిర్మాణంపై కొందరు నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని.. హాస్పిటల్ అందుబాటులోకి వచ్చాక విమర్శించిన నోళ్లు మూతబడుతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయని.. కానీ ప్రాజెక్ట్ పూర్తయ్యాక వాళ్లే నోరెళ్లబెట్టారని అన్నారు.
వరంగల్లో హెల్త్ సిటీ నిర్మాణం పూర్తైతే అవయవమార్పిడి చికిత్స కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని గుర్తు చేశారు. పల్లె దవాఖానాలతో ఆర్ఎంపీలు, నకిలీ వైద్యుల దందాకు చైక్ పెడతామని స్పష్టం చేశారు.