ఫుడ్ కల్తీ చేసేటోళ్లను వదలొద్దు

ఫుడ్ కల్తీ చేసేటోళ్లను వదలొద్దు

హైదరాబాద్, వెలుగు:  ఆహార పదార్థాలను కల్తీ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెల్త్ మినిస్టర్ హరీశ్‌‌రావు ఆదేశించారు. హైదరాబాద్, నాచారంలో రూ. 10 కోట్ల విలువైన మోడ్రన్ పరికరాలతో అప్‌‌గ్రేడ్ చేసిన ఫుడ్ టెస్టింగ్‌‌ ల్యాబ్‌‌, 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ బస్సులను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. బెవరేజేస్, పాలు, చిరు ధాన్యాల ఉత్పత్తులు, నూనెలు, మసాల దినుసులు, స్వీట్స్, రెడీ మేడ్ ఫుడ్, ఇతర విభాగాల ల్యాబ్ లను పరిశీలించారు. పరీక్షల విధానం, కల్తీ జరిగే తీరుపై  అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫుడ్ కల్తీని అరికట్టడంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం ఉంటుందన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు డెడికేషన్ తో పని చేయాలన్నారు. నెలవారీ రిపోర్టులు సిద్దం చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్  ఏర్పాటు చేయడం తో పాటు, విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామని మంత్రి మీడియాతో చెప్పారు. జీహెచ్‌‌ఎంసీలో ఇప్పుడున్న మొబైల్ ఫుడ్ టెస్టింగ్ బస్సుకు అదనంగా మరొకటి పని చేస్తుందన్నారు. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలోనూ ఒక్కో బస్సు ఉంటాయన్నారు. ఎక్కడైనా ఫుడ్ కల్తీ జరిగినట్లు తెలిస్తే.. ప్రజలు 040 21111111 నెంబర్ కు కాల్ చేయాలని, వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ఐపీఎం డైరెక్టర్ శంకర్, స్థానిక కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.