- రూ.32 కోట్లు మంజూరు చేశామన్న మంత్రి హరీశ్ రావు
- ఉస్మానియాలో మార్చురీ డెవలప్‌కు రూ.9 కోట్లు
- ఫీవర్ హాస్పిటల్లో కొత్త ఓపీడీ బ్లాక్‌కు శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 61 ఆసుపత్రుల్లో మార్చురీల మోడర్నైజ్కు ప్రభుత్వం 32.54 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రూ.9 కోట్లతో ఉస్మానియా హాస్పిటల్లో మార్చురీని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. శనివారం ఆయన ఫీవర్ ఆసుపత్రిలో కొత్త ఓపీడీ బ్లాక్‌కు శంకుస్థాపన చేశారు. 13 హార్సే వెహికల్స్(మృతదేహాలను తీసుకెళ్లే వెహికల్), మూడు అంబులెన్స్‌లు ప్రారంభించారు. తర్వాత హరీశ్ మాట్లాడుతూ ఫీవర్ ఆస్పత్రికి ప్రతి రోజు 500ల నుంచి 600ల మంది అవుట్ పేషెంట్లు, సీజనల్ రోగాల టైమ్‌లో వెయ్యిమంది వరకు వస్తారని అన్నారు. అందుకే కొత్త ఓపీడీ బ్లాక్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. ఫీవర్ హాస్పిటల్లో మార్చురీ అభివృద్ధి కోసం రూ.60 లక్షలు, డయాలసిస్ వింగ్ కోసం రూ.50 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. పబ్లిక్ హెల్త్ కోసం తలసరిగా రూ.1,690 ఖర్చు చేస్తూ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామన్నారు. గాంధీ, ఓయూ, కోరంటి మీద లోడ్ పెరిగిందని, అందుకే హైదరాబాద్ సిటీకి నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. వైద్యశాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు.
మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్న యూత్ కాంగ్రెస్
ఫీవర్ హాస్పిటల్‌కు వస్తున్న హరీశ్ రావు కాన్వాయ్‌ని బర్కత్‌పుర సిగ్నల్ వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్ మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు, స్టూడెంట్లు చనిపోతున్నా సర్కార్ స్పందించడం లేదని విమర్శించారు.