ఖమ్మంలో ఈ నెల 18న జరిగే సభ జాతీయ రాజకీయాలను మలుపు తిప్పుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ సత్తా ఏంటో ఖమ్మం సభ ద్వారా దేశానికి చాటి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. కూసుమంచిలో పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ ఖమ్మంలో జరుగుతోందన్నారు. ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు పలువురు జాతీయస్థాయి నాయకులు సభకు హాజరవుతారని ఆయన తెలిపారు.
ఒకప్పుడు వ్యవసాయం దండగ అని చెప్పిన కొందరు బీజేపీ నేతలు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. కరెంటు, ఎరువులు ఇవ్వనోళ్లు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ వ్యవసాయంలో మార్పులు తెస్తామని నల్ల చట్టాలు తెచ్చి .. 750 మంది రైతులను పొట్టన బెట్టుకుందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో ఆదాయం రెట్టింపు పక్కనబెడితే.. రైతుల పెట్టుబడి రెట్టింపు అయ్యిందన్నారు. చేపలు ఎండబెట్టడానికి కల్లాలు కట్టుకోమన్న బీజేపీ.. రైతులు కల్లాలు కట్టుకుంటే ఓర్వలేదన్నారు. ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ సభకు పాలేరు నుంచి 50 వేల మందికి తగ్గకుండా తరలిరావాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.