పెన్షన్ల పెంపుపై సర్కారు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించిన హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు

పెన్షన్ల పెంపుపై సర్కారు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించిన హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు
  • వృద్ధులు, నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపణ
  • పార్టీ మారతానని తప్పుడు ప్రచారం చేసేవారికి లీగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటీసులిస్తానని హెచ్చరిక 

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు మొదటి సంతకంతోనే పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచారని.. తెలంగాణలో ఆరు నెలలైనా కాంగ్రెస్  ప్రభుత్వం దాని ఊసే ఎత్తడంలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్  రావు అన్నారు. ‘‘ఏపీలో బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇచ్చారు. మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు?’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్​లో మీడియాతో హరీశ్  మాట్లాడారు. తమ పింఛను ఎప్పుడు పెంచుతారా అని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఎదురుచూస్తున్నారని, ప్రజాపాలన పేరిట కొత్తగా దరఖాస్తులు తీసుకొని వాటిని ఇంతవరకు పరిష్కరించలేదన్నారు. పేదలపై వివక్ష తగదన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో  ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగులకు రూ.6 వేలు, ఇతరులకు రూ.4 వేల పింఛను ఇవ్వాలి. పలు జిల్లాల్లో ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన పింఛను రాలేదని అవ్వ, తాతలు ఆవేదన చెందుతున్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామని,  అధికారం చేపట్టగానే జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  క్యాలెండర్  ప్రకటిస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఆరు నెలలైనా జాబ్  క్యాలెండర్  సిద్ధం చేయకుండా నిరుద్యోగులను మోసం చేసింది. మెగా డీఎస్సీ ద్వారా 25 వేల ఉద్యోగాలు కల్పిస్తామని 11 వేల పోస్టులు మాత్రమే ప్రకటించారు” అని హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రావు డిమాండ్ చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాసైన విద్యార్థులను 1:50  చొప్పున మెయిన్స్​కు ఎం పిక చేస్తున్నారని, అలా కాకుండా 1:100  చొప్పున ఎంపిక చేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 1:100 విధానం అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. 

నీట్​పై దర్యాప్తు చేయించాలి..

తాను పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు వ్యక్తులు సోషల్  మీడియాలో  వ్యూస్  కోసం ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేస్తూ తన క్రెడిబిలిటీని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అలాంటివి చేస్తే లీగల్  నోటీసులు పంపిస్తానని  హెచ్చరించారు. కాగా.. నీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అవకతవకలు జరిగాయని హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరోపించారు. తమ హయాంలో పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లీక్  అయితే.. బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి రచ్చరచ్చ చేశారని, ఇప్పుడు నీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పేపర్  లీక్ అయితే వారు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. నీట్  అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్  చేశారు.