అదానీతో దావోస్ ఒప్పందాల సంగతేంది? ..సీఎం రేవంత్​కు హరీశ్ రావు ప్రశ్న

అదానీతో దావోస్ ఒప్పందాల సంగతేంది? ..సీఎం రేవంత్​కు హరీశ్ రావు ప్రశ్న

హైదరాబాద్, వెలుగు:  స్కిల్ వర్సిటీకి గౌతమ్ అదానీ ఇచ్చిన రూ.100 కోట్లను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. దావోస్‌‌లో అదానీతో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతి ఏంచేస్తారని బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ‘‘20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడతామనే ప్రతిపాదనతో అదానీ వస్తే, మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించేశాం.

కాంగ్రెస్ మాత్రం ద్వంద్వ ప్రమాణాలు పాటించింది. అవినీతిపరుడని రాహుల్​ గాంధీ అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచింది. ఢిల్లీలో అదానీకి వ్యతిరేకంగా రాహుల్ పోరాటం చేస్తుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం అతనితో దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నడు. ఇప్పుడు అదానీ అవినీతి బయటకు రాగానే మాట మార్చారు’’ అని విమర్శించారు.

సర్కార్ నిర్లక్ష్యం వల్లే  స్టూడెంట్ మృతి

రేవంత్ సర్కారు నిర్లక్ష్యం వల్లే వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజ మరణించిందని హరీశ్ రావు అన్నారు. నాణ్యత లేని భోజనం పెట్టడంలో, అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యార్థిని కుటుంబానికి  రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.