దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన సీఎం కేసీఆర్ ఒక్కడేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని నంగునూర్ మండలం రాజగోపాల్ పేట గంగమ్మ గుడిలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ రోజు చేపలను వదిలినం కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపలు చనిపోతున్నాయి, బోరు వేయాలని ప్రజలు అడిగేవారని నాటి రోజులను మంత్రి గుర్తుచేసుకున్నారు.
ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని రాష్ట్రంలో పుష్కలంగా నీళ్లున్నాయని అన్నారు. గతంలో నీళ్లు లేక వ్యవసాయానికి ఇబ్బంది ఉంటే... ఇప్పుడు నీళ్లు వుండి పనిచేద్దామంటే కూలీలు దొరకడం లేదని తెలిపారు. అందుకే ఇతర రాష్ట్రాల కూలీలను పనుల కోసం వాడుతున్నామన్నారు. బద్దిపడగ నుంచి సిద్దిపేట వరకు రాజగోపాల్ పేట మీదుగా నాలుగు లేన్ల రహదారి వేసి బటర్ ఫ్లై టైట్లు వేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. దసరా పండగ తరువాత రెండు పడకల గదుల నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి తెలిపారు.