మంచిర్యాల/చెన్నూర్, వెలుగు: రాష్ట్రంలో వచ్చేది హంగ్ కాదని, హ్యాట్రిక్గవర్నమెంట్అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘‘ఎవరు ఔనన్నా.. కాదన్నా.. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తది. కేసీఆర్హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అయితరు” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో హరీశ్‌రావు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్చావునోట్లో తలకాయపెట్టి తెలంగాణ సాధించారని అన్నారు. పదేండ్లలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తే ప్రతిపక్ష పార్టీల మైండ్ బ్లాంక్ అవుతుందని తెలిపారు.
కాంగ్రెస్ వస్తే కర్ఫ్యూ వస్తది
కాంగ్రెస్ పార్టీది భస్మాసుర హస్తమని హరీశ్‌రావు విమర్శించారు. ‘‘ కాంగ్రెస్‌కు 60 ఏండ్లు అధికారం ఇస్తే ప్రజలకు చేసిందేమీ లేదు. మాటలు, మూటలు, ముఠాలు, మంటలు ఆ పార్టీ విధానం. సీఎం కుర్చీ కోసం హైదరాబాద్‌లో మతం మంటలు రేపింది. నక్సలైట్లతో చర్చలు అని వారిని మట్టు బెట్టింది. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే వైకుంఠపాళీలో పెద్దపాము మింగినట్టు తెలంగాణను మింగుతది” అని ఆయన దుయ్యబట్టారు. ‘‘పక్కనున్న చత్తీస్‌గఢ్‌లో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, రూ.2 వేల పింఛన్ ఇస్తున్నరా? ఇక్కడ కాంగ్రెసోళ్లు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నరు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్త అన్నట్టుంది కాంగ్రెస్ తీరు” అని ఎద్దేవా చేశారు. కర్నాటక నుంచి అవినీతి సొమ్ము తెచ్చి ఇక్కడ పంచి గెలవాలని కాంగ్రెస్ చూస్తున్నదని ఆరోపించారు. ‘‘పొరపాటునో, గ్రహపాటునో కాంగ్రెస్ గెలిస్తే మోసపోతం. కాంగ్రెస్ వస్తే కర్ఫ్యూ వస్తది.. కరువు వస్తది” అని కామెంట్ చేశారు. ‘‘రేవంత్‌రెడ్డి నాడు టీడీపీలో ఉండి కాంగ్రెస్ ను తిట్టిండు. సోనియాగాంధీని బలిదేవత అన్నడు. పెడితే పెండ్లి, లేదంటే సావు కోరే వ్యక్తి రేవంత్” అని హరీశ్ దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి ఏబీవీపీ నుంచి టీఆర్ఎస్లో చేరి టీడీపీలోకి పోయి ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారని, ఆయన మారని పార్టీ లేదని, రేపు ఏ పార్టీలోకి వెళ్తరో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు.
బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు
రాష్ట్రంలో బీజేపీకి గత ఎన్నికల్లో ఒక్క సీటు వచ్చిందని, ఈ సారి అది కూడా రాదని మంత్రి హరీశ్‌రావు కామెంట్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘నడ్డా... ఇది తెలంగాణ గడ్డా.. కేసీఆర్ అడ్డా...” అని అన్నారు. ‘‘సొంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీని గెలిపించుకోలేని నడ్డా తెలంగాణలో ఏం చేస్తడు. మిస్టర్ బీఎల్ సంతోష్... తెలంగాణలో వచ్చేది హంగ్ కాదు... హ్యాట్రిక్ గవర్నమెంట్. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా కేసీఆర్ సెంచరీ కొట్టి హ్యాట్రిక్ సాధించుడు ఖాయం” అని హరీశ్ పేర్కొన్నారు. బీజేపీలో కమిటీల మీద కమిటీలు వేస్తున్నారని, చేరికల కమిటీ అట్టర్ ఫ్లాఫ్ అయిందని, ఇక డిపాజిట్ల కమిటీ వేసుకుంటే మంచిదని విమర్శించారు. కాగా, జిల్లాలోని హాజీపూర్మండలం దొనబండ స్టేజ్దగ్గర పడ్తన్‌పల్లి లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్‌కు హరీశ్ శంకుస్థాపన చేశారు. చెన్నూర్‌లో కొత్తగా నిర్మించిన 50 బెడ్స్హాస్పిటల్ను ప్రారంభించారు.