పెనుబల్లి/ కల్లూరు, వెలుగు: ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్‌లా వుండేదని.. కానీ, ఖమ్మంకు ఆ పార్టీ చేసిందేమీలేదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. జిల్లాకు ఒక్క మెడికల్‌కాలేజీ కూడా తీసుకురాలేకపోయిందన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు, పెనుబల్లి మండలాల్లో రూ.18 కోట్లతో కొత్తగా నిర్మించే ప్రభుత్వ ఆస్పత్రి భవనం, ఎన్ఎస్పీఎస్ఈ భవనానికి రవాణా మంత్రి పువ్వాడ అజయ్, స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి హరీశ్ సోమవారం శంకుస్థాపన చేశారు. తర్వాత కల్లూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేసిన పథకాలపై ఢిల్లీలో ఎన్నో అవార్డులు ఇచ్చిందని, బీజేపీ అగ్రనేతలు మాత్రం హైదరాబాద్ వచ్చాక తిడుతున్నారని ఎద్దేవా చేశారు. కర్నాటకలో ఓడిపోతామనే భయంతోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎల్పీ లీడర్‌గా ఉన్న భట్టి విక్రమార్క తన సొంత నియోజకవర్గం మధిరలో 100 పడకల ఆస్పత్రిని ఎందుకు తెచ్చుకోలేకపోయారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలను అమలు చేయలేదన్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రతి మండలానికి, ప్రతి పంటకు 3 నెలల్లో సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు అందిస్తామని, కృష్ణా, గోదావరి నదులు అనుసంధానించి రాష్ట్రాన్ని కరువులేని ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హరీశ్ చెప్పారు. మెడికల్ కాలేజీ అనుమతి ఉత్తర్వులను ఈ సందర్భంగా పువ్వాడ అజయ్‌కు అందజేశారు. ఈ కాలేజీ ద్వారా విద్యార్థులు ఏటా రూ.10 వేలు ఫీజుతో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేస్తారని, జులై నుంచి క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి , ఎమ్మెల్సీ తాతమధుసూధన్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
డెలివరీలన్నీ దవాఖాన్లలోనే జరుగుతన్నయ్
రాష్ట్రంలో డెలివరీలు 100% హాస్పిటల్స్‌లోనే జరుగుతున్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఒక్క డెలివరీ కూడా ఇంట్లో జరగడం లేదని వెల్లడించారు. వంద శాతం డెలివరీ హాస్పిటల్‌లోనే జరుగుతున్న రాష్ట్రం, దేశంలో తెలంగాణ మాత్రమేనని ఆయన చెప్పారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రిపోర్ట్ పేర్కొన్న అంశాలను మంత్రి సోమవారం ట్వీట్ చేశారు. అబార్షన్‌లు తక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని తెలిపారు. వ్యాక్సినేషన్, యాంటినాటల్ చెకప్స్, సెక్స్ రేషియో తదితర అంశాల్లో తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.