బీఆర్ఎస్ పథకాలే కాపీ కొట్టారని ఫైర్
2009 మేనిఫెస్టో హామీల్లో ఎన్ని నెరవేర్చారో చెప్పాలని డిమాండ్
గజ్వేల్/ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ఆచరణ సాధ్యం కాని హామీలతో 42 పేజీల మేనిఫెస్టో విడుదల చేసిందని, కానీ అది 420 మేనిపెస్టో అని మంత్రి హరీశ్రావు విమర్శించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన దివ్యాంగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్2009 మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో ఎన్ని నెరవేర్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘గతంలో అమలు చేయని, ఆచరణ సాధ్యం కాని పథకాలను పెట్టి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తానంటే ఎవరూ నమ్మరు. కాంగ్రెస్పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు చేయని పథకాలను ఇక్కడ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం చెవిలో పువ్వులు పెట్టడం కాదా? ఆ పార్టీ ఎలాగూ అధికారంలోకి వచ్చేది లేదు.. అమలు చేసే అవసరం అసలే లేదు. కాబట్టే ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నరు’’ అని అన్నారు.
కాగా, బీఆర్ఎస్ పథకాలనే కాపీ కొట్టి కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేశారని హరీశ్ విమర్శించారు. ‘‘రైతుబంధును నఖలు కొట్టిన్రు. ధరణిని కాపీ కొట్టి భూమాత అంటున్నరు. కల్యాణలక్ష్మిని ఇందిరమ్మ అంటరట’’ అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకమని, ఆయన మాట తప్పని వ్యక్తి అని కొనియాడారు. ‘‘గజ్వేల్లో ఆపతికి అందుబాటులో ఉన్నం. ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్నోళ్లు అన్ని జూటా మాటలు మాట్లాడుతున్నరు’’ అని ఈటలపై హరీశ్ మండిపడ్డారు.
రాహుల్ గాంధీ.. రాంగ్ గాంధీ అయిండు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. రాంగ్ గాంధీ అయ్యారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కర్నాటక ఫెయిల్ మోడల్ గురించి చెప్పి ఆయన రాష్ట్రంలో ఓట్లు అడగాలని సవాల్ చేశారు. కర్నాటక ప్రజల్లాగా కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవడానికి సిద్ధంగా తెలంగాణ ప్రజలు లేరన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో హరీశ్రావు సమక్షంలో కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక బీఆర్ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ నేత చిదంబరం మరోసారి తెలంగాణ ప్రజల మనసును గాయపరిచేలా మాట్లాడారు. అమరుల త్యాగాలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలి. కర్నాటకలో ఐదు గ్యారంటీలు అని చెప్పి మోసం చేసిన రాహుల్ గాంధీ.. తెలంగాణలో ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేయడానికి వస్తున్నారని హరీశ్ విమర్శించారు. వంద రోజుల్లోనే ఉద్యోగాలిస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.