- రుణమాఫీపై రైతులను గందరగోళానికి గురిచేస్తున్నరు: హరీశ్‌రావు
- సర్కార్ తీరు వల్లే రైతు సురేందర్‌రెడ్డి చనిపోయిండు
- ఇంకా 21 లక్షల మందికి రుణమాఫీ జరగలే
- కుటుంబాలను కేసీఆర్ బలోపేతం చేస్తే రేవంత్ విచ్ఛిన్నం చేస్తున్నడు
- రైతులకు యమపాశంగా కాంగ్రెస్ పాలన మారిందని విమర్శ
- బాధతో, దుఃఖంతో ప్రెస్మీట్పెట్టాల్సి వస్తున్నదని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: రైతు రుణమాఫీ ఎగ్గొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాకులు చూపెడుతున్నదని, అన్నదాతలను సీఎం రేవంత్‌రెడ్డి వంచించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు దుయ్యబట్టారు. ‘‘రైతు రుణమాఫీ ఆంక్షలతో కుటుంబ బంధాల్లో రేవంత్ చిచ్చుపెట్టిండు. కుటుంబ బంధాలను కేసీఆర్ బలోపేతం చేస్తే వాటిని విచ్ఛిన్నం చేసిన దరిద్రపు గొట్టు ప్రభుత్వం రేవంత్‌ది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది కంజూస్, కటింగ్ సర్కార్ అని విమర్శించారు. కాంగ్రెస్ అంటే కోతలు అన్నట్టుగా తయారైందని, ఎన్నికలప్పుడు కట్టు కథలు చెప్పారని, చేతి గుర్తుకు ఓటేస్తే కోతలే మిగిలాయని ఆయన అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ బాధతో, దుఃఖంతో పెట్టాల్సి వస్తున్నదని తెలిపారు. తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలన కర్షకులకు యమపాశంగా మారిందని మండిపడ్డారు.
సురేందర్‌రెడ్డిని ప్రభుత్వమే చంపింది
రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారి కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హరీశ్‌రావు అన్నారు. మేడ్చల్ లో వ్యవసాయ శాఖ ఆఫీసు ముందు లేఖ రాసి సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని, సురేందర్ రెడ్డికి ఏపీజీవీబీలో అప్పు ఉందని, ఆయన తల్లికి రూ.లక్షా 15 వేలు, ఆయనకు రూ. లక్షా 92 వేలు అప్పు ఉందని తెలిపారు. కుటుంబ సభ్యుల్లో ఒక్కరికే రుణమాఫీ అవుతుందని బ్యాంకు మేనేజర్ అనిరుధ్ చెప్పడం తో సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు. ‘‘సురేందర్ రెడ్డిని చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్య” అని వ్యాఖ్యానించారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని, రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన నియోజకవర్గంలోని జక్కాపూర్‌లో గురజాల బాల్ రెడ్డి కుటుంబంలో ముగ్గురికి రుణం ఉందని, వారికి రూ. ఆరు లక్షల అప్పు ఉంటే కేవలం రెండు లక్షలే మాఫీ అవుతున్నదని తెలిపారు. ఇది రైతులకు రేవంత్ చేసిన మోసం, దగా కాదా? అని ప్రశ్నించారు. ఇప్పటిదాకా 20 లక్షల మందికే రుణ మాఫీ అయిందని, 21 లక్షల మందికి కావాల్సి ఉందని తెలిపారు. రూ. రెండు లక్షలపైన రుణం ఉన్నవాళ్లు మిగతా డబ్బు బ్యాంకులకు కట్టాలని ప్రభుత్వం చెప్తున్నదని, ఎందుకు కట్టాలని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఇలాంటి నిబంధనలు ఉన్నాయా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రెస్మీట్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.