
సిద్దిపేట: విద్య లేనిదే విముక్తి లేదని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నమ్మారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో సోమవారం అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ చదువుకున్నది చీకట్లో ఉన్నవారిని వెలుగులోకి తీసుకురావడం కోసమేనని కొనియాడారు. అమెరికాలో మహిళలకు చాలా ఏండ్లు ఓటు హక్కు లేదని.. కానీ మన దేశంలో స్త్రీ, పురుషులకు ఓటు హక్కును కల్పించిన మహానాయకుడు అంబేడ్కర్ అని అన్నారు.
అంబేద్కర్ ముందు చూపు వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని.. ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వలనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అంబేద్కర్ అందరివాడు కానీ తెలంగాణలో అందరికీ దగ్గరివాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బెస్ట్ అవేలెబుల్ స్కూల్లో 8వేల విద్యార్థుల నుంచి 25వేల విద్యార్థులకు పెంచారు. ఏడాదిన్నర నుండి బెస్ట్ అవేలెబుల్ స్కూల్లో చదివే విద్యార్థులకు రూపాయి కూడా నిధుల విడుదల చేయలేదు. 25 వేల మంది విద్యార్థులను ఆగం చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాస్తే ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదని మండిపడ్డారు.
విదేశాలకు వెళ్లిన దళిత విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇవ్వకపోవడం వల్ల ఆందోళనలో ఉన్నారని.. వారు చదువు మానేసే ఆలోచనలో ఉన్నారన్నారు. విద్యార్థుల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు బేస్మెంట్ నిర్మించే ముందే లక్ష రూపాయలు ఇవ్వాలని అడిగితే ప్రభుత్వం స్పందించడం లేదని.. ప్రభుత్వం డైరెక్షన్ లెస్‌గా పని చేస్తుందని విమర్శించారు. జీఓ 29 ను రద్దు చేయాలని విద్యార్థులు ఆందోళన చేస్తే పోలీసులతో కొట్టిస్తున్నారని.. పిల్లల భవిష్యత్ కాపాడడం కోసం అందరూ కలిసి కొట్లాడుదామన్నారు.