తెలంగాణలో హైడ్రాపేరుతో డ్రామా నడుస్తోందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. హైడ్రాపేరుతో రాజకీయకక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. రుణమాఫీ సమస్యను పక్కదారి పట్టించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఆస్తులు కూల్చివేస్తున్నారని ఆరోపించారు హరీశ్.
పల్లాను ఆర్థికంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారని విమర్శించారు హరీశ్ రావు . అక్రమంగా కాలేజీలు నిర్మించారని నిరూపిస్తే వాటిని పల్లానే కూల్చేస్తారని చెప్పారు. కాంగ్రెస్ లో చేరకుంటే అక్రమ కేసులు పెడుతోందన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రేవంత్ టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు హరీశ్ .
హైకోర్టుకు పల్లా
బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్శిటీ నిర్మించారని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ నిర్మాణాలు హైడ్రా కూల్చివేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
దీంతో BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం హైకోర్టు ను ఆశ్రయించారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. అన్నీ అనుమతులు తీసుకున్న తర్వాతనే యూనివర్సిటీ నిర్మాణాలు చెప్పట్టామని పల్లా తరపు న్యాయవాది తెలిపారు. ల్యాండ్ డాక్యుమెంట్స్, అనుమతుల పత్రాలు చెక్ చేసిన తర్వాతనే నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.