
- కేసీఆర్ పాలనలో కరువనేదే లేదు
- కేసీఆర్ లేకుంటే కాళేశ్వరం వచ్చేదా?
- రైతులు బాగుపడేవారా? అని ప్రశ్న
- సిద్దిపేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన
సిద్దిపేట, వెలుగు: ఈ వయసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇది మంచిది కాదని పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిపై మంచి మాటలు చెప్పారు. ‘ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే, తెలంగాణలో ఐదెకరాలు వచ్చేవి. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే, ఆంధ్రాలో ఐదారు ఎకరాలు వస్తున్నాయి’ అని స్వయంగా చంద్రబాబు అన్నారు” అని హరీశ్ రావు తెలిపారు. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో కరువనేదే లేదని, ఆయనకు దైవ సంకల్పం తోడైందని చెప్పారు.
‘‘ఉచిత కరెంట్ అంటూ ఉత్త కరెంట్ చేసిన ఘనత కాంగ్రెస్వాళ్లదే. రైతులకు 24 గంటలు కాదు.. మూడు గంటల కరెంట్చాలంటున్న కాంగ్రెసోళ్ల మాటలు సూర్యునిపై ఉమ్మేసినట్టుగా ఉంది” అని విమర్శించారు. ‘‘మన దేశంలో వంట నూనె కొరత తీరాలంటే ఇంకా 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్‌సాగు చేయాలి. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి పామాయిల్ తోటల పెంపకాన్ని ప్రొత్సహిస్తున్నారు.
తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ప్లాన్ చేశాం” అని వెల్లడించారు. ‘‘తెలంగాణ ఏర్పడితే.. ఏం వచ్చిందని వాడొకడు వీడొకడు అంటున్నడు. కేసీఆర్ లేకుంటే, తెలంగాణ రాకుంటే.. కాళేశ్వరం వస్తుండేనా? రైతులు బాగుపడేవారా?’’ అని ప్రశ్నించారు. సభలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్ డీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి, రాష్ట్ర హార్టికల్చర్ కమిషనర్ హన్మంతరావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.