- రేవంత్.. కిసాన్ హటావో అంటున్నడు
- సీఎం తీరుతో అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారని కామెంట్
హైదరాబాద్, వెలుగు: ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాలను లాక్కుని కిసాన్ హటావో అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ పాలన ఉందని ‘ఎక్స్’ లో ఆయన విమర్శించారు. ‘‘రేవంత్ మీద ఉన్న కోపాన్ని రైతులు జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారుల మీద చూపుతున్నారు. సీఎం అసమర్థ పాలనకు ఐఏఎస్‌లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారు. ఫార్మా సిటీ కోసం మాజీ సీఎం కేసీఆర్.. హైదరాబాద్ కు దగ్గరగా, కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాలు సేకరించి సిద్ధం చేసిండు.
పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చిన దానిని పక్కనపెట్టి పచ్చటి పొలాల్లో రేవంత్ రెడ్డి ఫార్మా చిచ్చు బెడుతున్నడు. జహీరాబాద్ న్యాల్కల్ మండలంలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని తన రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగించుకునేందుకు కుట్రచేస్తున్నారు” అని హరీశ్ పేర్కొన్నారు. పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక మద్యం అమ్మకాల లక్ష్యాలను చేరుకోనందుకు 30 మంది ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లకు రేవంత్ ప్రభుత్వం మెమోలు జారీ చేయడం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని డొల్లతనాన్ని బయటపెడుతున్నదని హరీశ్ అన్నారు. మద్యం అమ్మకాలు అరికడతామని, బెల్టు షాపులను మూసివేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మద్యం అమ్మకాలు పెంచాలని అధికారులనుఒత్తిడి చేస్తున్నారన్నారు.