సిద్దిపేట, వెలుగు: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరి శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు సూ చించారు. సోమవారం సిద్దిపేట మున్సిపాలిటీలోని 18వ వార్డులో ‘నడకతో ఆరోగ్యం.. చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణాన్ని చేద్దాం’ అనే నినాదంతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 18వ వార్డులోని వీధుల్లో తిరుగుతూ రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తను స్వయంగా ఎత్తేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడారు. మన చెత్తను మనమే తొలగించాలని, ఇది మన బాధ్యత అని అన్నారు. తర్వాత 22వ వార్డులో నిర్వహించిన ఫ్రీ ఆనంద యోగా క్యాంప్‌కు హాజరై యోగా చేసేవాళ్లకు మ్యాట్లు పంపిణీ చేశారు. యోగా చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటామన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని సూచించారు. దీంతో జీవిత కాలం పెరుగుతుందని తెలిపారు. అమెరికా, యూరప్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. పిల్లలకు కూడా యోగా నేర్పించాలని సూచించారు.