ఏపీ నీళ్లు ఎత్తుకపోతుంటే ఏం చేస్తున్నరు? : హరీశ్

ఏపీ నీళ్లు ఎత్తుకపోతుంటే ఏం చేస్తున్నరు? : హరీశ్
  • సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్.. మౌనం ఎందుకు?: హరీశ్ 
  • రోజుకు 10 వేల క్యూసెక్కులు దోచేస్తున్న ఏపీ   
  • ఈఒక్క వాటర్ ​ఇయర్​లోనే 646 టీఎంసీలు ఎత్తుకెళ్లిందని ఫైర్  

హైదరాబాద్, వెలుగు: ఏపీ జల దోపిడీకి పాల్పడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు మండిపడ్డారు. ‘‘కృష్ణా జలాలను అడ్డూఅదుపు లేకుండా ఏపీ దోచేస్తున్నా.. సీఎం రేవంత్​ రెడ్డి, ఇరిగేషన్​మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఏం చేస్తున్నారు? సాగర్​కుడి కాల్వ నుంచి మూడు నెలలుగా ఏపీ రోజూ 10 వేల క్యూసెక్కులను తరలించుకుపోతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ ఒక్క వాటర్​ఇయర్​లోనే ఏపీ 646 టీఎంసీలు తరలించుకుపోయినా ఎందుకు నోరు మెదపడం లేదు? రాష్ట్ర ప్రయోజనాలు కాంగ్రెస్​సర్కార్ కు పట్టవా?” అని ఫైర్ అయ్యారు.

 ఈ మేరకు హరీశ్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ‘‘నాగార్జున సాగర్​ప్రాజెక్ట్​కేంద్ర బలగాల అధీనంలో ఉంది. వారి పర్యవేక్షణలో మాత్రమే నీటిని విడుదల చేసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఏపీ ఇష్టారాజ్యంగా నీటిని తరలిస్తున్నది. తెలంగాణ తాగునీటి అవసరాలకు శ్రీశైలం, సాగర్​జలాశయాల్లో నిల్వ ఉంచాల్సిన కోటాను ఏపీ తీసుకెళ్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో మిగులు నిల్వలు లేకున్నా పోతిరెడ్డిపాడు, సాగర్ కుడి కాల్వ ద్వారా ఇప్పటికే ఏపీ నీటిని తరలిస్తూ మొండిగా వ్యవహరిస్తున్నది. 

ఉమ్మడి ప్రాజెక్టుల నీటి వినియోగంపై ఏటా కేఆర్ఎంబీ త్రీమెన్​కమిటీ సమావేశాన్ని నిర్వహించాలి. కానీ, ఈ ఏడాది ఇప్పటివరకు త్రీమెన్​కమిటీ మీటింగ్ పెట్టలేదు. బోర్డు పనితీరు ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏపీ నీటి తరలింపును అడ్డుకునేందుకు బోర్డుపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడంలో ఘోరంగా విఫలమైంది. రాష్ట్ర నీటి హక్కులను కాపాడలేకపోయింది. 

ఏపీ దుందుడుకు చర్యలు, రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంతో సాగర్​, శ్రీశైలం ప్రాజెక్టులు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. ఎండాకాలం మొదలు కావడానికి ముందే తెలంగాణ రైతులు నీళ్ల కోసం రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఏపీ నీటి దోపిడీని రాష్ట్ర సర్కార్ అడ్డుకోవాలి. లేదంటే రాష్ట్రంలోని సాగర్​ఆయకట్టు ప్రమాదంలో పడుతుంది. సాగర్​లో నీటి మట్టం పడిపోతే హైదరాబాద్​సిటీకీ తాగునీటి సమస్య ఏర్పడుతుంది’’ అని ప్రకటనలో హరీశ్ రావు పేర్కొన్నారు.