పాలన చేతగాక ప్రకృతి మీద నిందలా? : హరీశ్​ రావు

పాలన చేతగాక ప్రకృతి మీద నిందలా? : హరీశ్​ రావు
  • ఎండలకు పంటలు ఎండుతున్నాయని రేవంత్​ అనడం దారుణం: హరీశ్​ రావు
  • కేసీఆర్​ ఉన్నప్పుడు ఎండలు లేవా?
  • ఇది ప్రకృతి కరువు కాదు.. రేవంత్​ తెచ్చిన కరువని మండిపాటు

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డికి పాలన చేతగాక ప్రకృతి మీద నిందలు వేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు మండిపడ్డారు. ఎండలకు పంటలు ఎండుతున్నాయని దారుణంగా మాట్లాడుతున్నారని, కేసీఆర్​ ఉన్నప్పుడు ఎండలు లేవా అని ప్రశ్నించారు. ఈ ఏడాది వర్షాలు సగటు కన్నా ఎక్కువే పడ్డాయని, కృష్ణా, గోదావరి నదులు పొంగి ప్రవహించాయని, రిజర్వాయర్లన్నీ నిండాయని చెప్పారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, రేవంత్​ తెచ్చిన కరువు అని విమర్శించారు.

కేసీఆర్​ నీళ్లను ఒడిసిపడితే.. రేవంత్​ నీళ్లను వదిలిపెట్టారని మండిపడ్డారు. ఓ వైపు ఏపీ మొత్తం నీళ్లు తీసుకుపోయిందని అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. దేవాదులలో కావాల్సినన్ని నీళ్లున్నా.. మోటార్లు ఆన్​ చేయలేదన్నారు. వరంగల్​ జిల్లాలో లక్ష ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయన్నారు. రూ.7 కోట్ల బిల్లులు ఇవ్వలేదని దేవాదుల వద్ద 32 రోజులపాటు కార్మికులు సమ్మె చేశారని, దీంతో నీళ్లు రాక కిందకు జారిపోయాయని అన్నారు. 

కమీషన్​ కుదరకనే రూ.7 కోట్ల బిల్లులు ఇవ్వలేదని హరీశ్ ఆరోపించారు. కేసీఆర్​ నిర్మించిన సమ్మక్కసాగర్​లో 3.5 టీఎంసీల నీళ్లున్నాయన్నారు. అయినా నీళ్లివ్వట్లేదన్నారు. కల్వకుర్తి లిఫ్టులను 25 రోజులుగా ప్రారంభించలేదని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటే రాజకీయాల్లో అంతో ఇంతో విలువలు పాటించే నాయకుడన్న పేరుండేదని, ఇప్పుడు రేవంత్​ దుష్ట సావాసంతో ఆయన కూడా చెడిపోయారని ఆరోపించారు. బాడీ షేమింగ్, అబద్ధాల్లో రేవంత్​తో పోటీ పడుతున్నారని మండిపడ్డారు.

అబద్ధానికి అంగీలాగు తొడిగితే రేవంత్

అబద్ధానికి అంగీ లాగు తొడిగితే రేవంత్​ రెడ్డిలా ఉంటుందని హరీశ్​ రావు అన్నారు. పరేడ్​గ్రౌండ్​ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. మహిళలకు రూ.21 వేల కోట్ల రుణాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు చెప్పారన్నారు. రూ.5 వేల కోట్లే ఇచ్చారని, ఇంకా బకాయి పెట్టారని అన్నారు. మిగతా 16 వేల కోట్లకు 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతామన్నారని, కానీ, 15 నెలలవుతున్నా రూ.5 లక్షల పరిమితిని సవరించలేదని అన్నారు. మహిళా దినోత్సవంనాడైనా రూ.10 లక్షలకు పెంచుతూ జీవో ఇస్తారనుకుంటే.. మహిళలందరినీ మోసం చేశారని ఆరోపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలకు పైసా కూడా వడ్డీ లేని రుణాలను విడుదల చేయలేదని అన్నారు. 

రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలిచ్చామన్న మాట నిజమే అయితే.. చెల్లించిన వడ్డీలతో సహా శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. మహిళా సంఘాలు కుడుతున్న యూనిఫాంలకు జతకు రూ.75 ఇస్తున్నామని రేవంత్​ చెబుతున్నారని, కానీ, ఇస్తున్నది 50 రూపాయలేనని అన్నారు. మొబైల్​ ఫిష్​ వ్యాన్లను కూడా తమ ఘనతగా రేవంత్​ సర్కారు చెప్పుకుంటున్నదని మండిపడ్డారు. పీఎం మత్స్య సంపద యోజన కింద 60 శాతం సబ్సిడీ వస్తే.. 40 శాతం స్వయం సహాయక సంఘాల కింద రుణంగా తీసుకుంటారన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఘనత ఏముందని ప్రశ్నించారు. 

రేవంత్​ ప్రమాదబీమా చెక్కుల పంపిణీ కూడా పెద్ద జోక్​గా మారిందని విమర్శించారు. ప్రజాపాలన ఏడాది ఉత్సవాల సందర్భంగా 2024 నవంబర్​ 7న వరంగల్​లో జరిగిన కార్యక్రమంలో రూ.35 కోట్ల చెక్కును మహిళా సంఘాలకు రేవంత్​ ఇచ్చారని, 3 నెలలకు ఆ చెక్కు క్లియర్​కాక లాప్స్​ అయిందన్నారు. దానికి ఇంకో రూ.9 కోట్లు కలిపి రూ.44 కోట్లు కొత్తగా ఇచ్చారన్నారు.