వడ్ల కొనుగోళ్లపై రైతుల ఇబ్బందులు పట్టవా? : హరీశ్​రావు

  • రేవంత్​ దృష్టంతా మహారాష్ట్రకు డబ్బు మూటలు పంపుడుపైనే : హరీశ్​రావు
  • బీఆర్ఎస్​ రైతు గర్జన ధర్నాకు హాజరు

మెదక్/నర్సాపూర్, కొల్చారం, వెలుగు : వడ్ల కొనుగోలు జరగక రైతులు రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వానికి పట్టదా? అని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు ప్రశ్నించారు.  సీఎం రేవంత్​రెడ్డి దృష్టంతా మహారాష్ట్రకు డబ్బు మూటలు పంపుడుపైనే ఉన్నదని ఆరోపించారు. శనివారం మెదక్​ జిల్లా కొల్చారంలో బీఆర్ఎస్​ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన ధర్నాకు హరీశ్​రావు హాజరయ్యారు. నర్సాపూర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్  మెడలు వంచి రైతు రుణమాఫీ పూర్తిగా చేసేందుకు

పంట చేతికి వచ్చినా రైతు బంధు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను ఎత్తి చూపేందుకే ఈ రైతు దీక్ష చేపట్టినట్టు చెప్పారు.  కాంగ్రెస్​ సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని పక్కగా అమలు చేయలేదని, కానీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారంటీలన్నీ అమలు చేశామని సీఎం రేవంత్​ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. రేవంత్​ బూతు సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. సినిమాల్లో మాదిరిగా రాజకీయాల్లో కూడా సెన్సార్​ బోర్డు పెట్టి రేవంత్​ రెడ్డికి 'ఏ’ సర్టిఫికెట్​ ఇవ్వాలని అన్నారు.  

కొల్చారం మండలం చిన్న ఘనపూర్​ సొసైటీలో 600 మంది రైతులు ఉంటే ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని హరీశ్​ రావు అన్నారు. అక్కడ రైతులకు రుణ మాఫీ అయినట్టు నిరూపిస్తే తాను  ఏడుపాయల వద్ద నదిలో దుంకుతానని, రుణమాఫీ చేయనట్టయితే సీఎం రేవంత్​ రెడ్డి  దుంకాలని సవాల్​ విసిరారు.  ప్రభుత్వం ఎక్కడైతే ఇండ్లు కూలగొట్టిందో అక్కడినుంచే మూసీ పాదయాత్ర చేద్దామని అన్నారు.  

మూసీ కాలుష్యం వారి పుణ్యమే

66 ఏండ్ల కాంగ్రెస్ , టీడీపీ ప్రభుత్వాల పుణ్యమే మూసీ కాలుష్యమని హరీశ్​ రావు పేర్కొన్నారు. కేసీఆర్​ రూ. 3,800 కోట్లు ఖర్చుపెట్టి మూసీ పునరుజ్జీవాన్ని ప్రారంభించారని,  రూ.11 వేల కోట్లతో కాళేశ్వరం నీళ్లు తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు గుర్తు చేశారు.  ఆంధ్రబాబుల బ్యాగులు మోసిన రేవంత్ రెడ్డికి కేసీఆర్,  తెలంగాణ విలువ ఏం తెలుసన్నారు. ప్రభుత్వం చేతకానితనం వల్లే ఇప్పటికే 30% వడ్లు దళారుల పాలయ్యాయని, ప్రభుత్వం ధాన్యం కొనే పరిస్థితి లేదన్నారు. వడ్లన్నీ కొనేదాకా, వానాకాలం, యాసంగి కలిపి రైతు బంధు పైసలిచ్చేదాకా పోరాటం చేస్తామని చెప్పారు.

పాలన వదిలిపక్క రాష్ట్రాల్లో ప్రచారమా?

హైదరాబాద్, వెలుగు : సీఎం, మంత్రులు రాష్ట్రంలో పాలనను వదిలేసి.. పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి క్యూ కట్టారని హరీశ్​రావు మండిపడ్డారు. ఈ మేరకు హరీశ్ రావు శనివారం ట్వీట్ ​చేశారు. ‘‘పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి సొంత జిల్లాలోనే వడ్ల కొనుగోళ్లు జరగడం లేదు. బిల్లులు విడుదల చేయకపోవడంతో పంచాయతీ ఆఫీసును తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పట్టించుకోరు.

సీతక్క సొంత జిల్లాలోనే పత్తికి మద్దతు ధర రావడం లేదు. ఫుడ్​పాయిజనింగ్‌‌తో గురుకులాల్లో విద్యార్థుల ప్రాణాలు పోతున్నా విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ మొద్దు నిద్ర వీడట్లేదు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలున్నా అవేవీ పట్టనట్టు.. జార్ఖండ్​కు భట్టి, కేరళకు సీతక్క, మహారాష్ట్రకు సీఎం రేవంత్​క్యూ కట్టారు’’ అని విమర్శించారు.