
- మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
సిద్దిపేట, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్ పట్ల కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారం వద్ద రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి బిక్కబండ గుట్టకు ఆదివారం నీళ్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్, మిడ్‌మానేరు ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా.. పిల్ల కాల్వల నిర్మాణానికి ఒక రూపాయి కూడా విడుదల చేయకపోవడం, కొత్తగా ఒక్క ఎకరం భూసేకరణ కూడా చేయలేదని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ హయాంలో ప్రాజెక్టులు కడితే... భూ సేకరణ చేసి, కాల్వలు తవ్వి నీళ్లు ఇవ్వాల్సిన కాంగ్రెస్ ఆ పని కూడా చేయడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద భూసేకరణ చేయకపోవడంతో కొందరు రైతులు స్వచ్చంధంగా కాల్వలు తవ్వుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వాన్ని నిద్ర లేపే ప్రయత్నం చేస్తున్నా స్పందన ఉండడం లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో సాంకేతిక కారణాలతో కుంగిన పిల్లర్లకు రిపేర్లు చేసి నీళ్లు ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలోని 52 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామన్నారు. కాళేశ్వరం కూలిందన్న అసత్య ప్రచారం ఆపి, భూ సేకరణ చేసి కాల్వలు తవ్వి రైతులకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.