- పంటలకు నీళ్ల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. రైతన్నకు కన్నీటి గోస తెచ్చిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పంటలకు నీళ్ల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితిని తెచ్చిందని సోమవారం ఆయన ట్వీట్ చేశారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రం మొత్తమ్మీద పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ‘‘యాసంగి సాగునీటి విడుదల షెడ్యూల్ పేరిట కోట్ల ప్రజాధనం వెచ్చించి ప్రకటనలు ఇచ్చారు. ఎస్సారెస్పీ స్టేజ్–-2లో భాగంగా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ తదితర నియోజకవర్గాల్లోని 3,36,630 ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తామని ప్రకటనల్లో పేర్కొన్నారు.
ప్రచారం చేసుకున్నారు గానీ, రైతన్నల పంట పొలాలకు నీళ్లు మాత్రం విడుదల చేయడం లేదు. మీ ప్రభుత్వ మాటలు నమ్మి నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏం కావాలి..? నాట్ల దశలోనే సాగునీటికి గోస పడితే, మున్ముందు సాగు నీరు ఎలా సరఫరా చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటవని మరోసారి రుజువైంది” అని విమర్శించారు.