
పంటలు ఎండిపోతున్న రైతులను పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తీవ్రంగా సాగు నీటి ఎద్దడి ఉందన్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు వేసినా నీళ్లు పడటం లేదని.. పంటలు ఎండిపోయి రైతులు కష్టాలు పడుతుంటే.. కాంగ్రెస్ సర్కార్ కు చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగు నీళ్లు లేక రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల పంట ఎండిపోయిందని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఎన్నడూ ఇలాంటి బాధలు రాలేదని రైతులే చెబుతున్నారన్నారు. మేము క్షత్రస్థాయిలో పంటలను పరిశీలించడానికి వెళితే.. రైతులు తమ బాధలు చెప్పుకుంటున్నారని.. ఎండిపోయిన పంటలను చూస్తుంటే మా గుండె తరుక్కుపోయిందన్నారాయన.
Also Read: BRS పేరు.. మళ్లీ TRSగా.. కేసీఆర్ యూటర్న్
నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని హరీష్ రావు విమర్శించారు. రైతులను పరామర్శించి, భరోసా కలిపించే టైం కుడా ప్రభుత్వానికి, అధికారులకు లేదా? అని హరీష్ రావు ప్రశ్నించారు. గోదావరి నదిలో నీళ్లు ఉన్నప్పటీ ప్రభుత్వం రైతులకు అందించలేక చేతులెత్తేసిందన్నారు. కాంగ్రెస్ వచ్చాక నీళ్లు లేవు.. కరెంటు లేదు.. మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయని చెప్పారు. రైతులు ఇంతా ఇబ్బందులు పడుతున్నా.. సీఎం రేవంత్ రెడ్డి అసలు పట్టించుకోవడంలేదని.. ఎంతసేపు ఇతర పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకోవడంపై ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు. తాను గేట్లు తెరిచానని రేవంత్ అం టున్నారని.. గేట్లు తెరవాల్సింది రాజకీయ పార్టీల కోసం కాదు.. రైతు కోసం గేట్లు తెరువు... సీఎం, మంత్రులు హైదరాబాద్‌లో రాజకీయాలు మాని వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి రైతులకు ఆత్మవిశ్వాసం కల్పించాలన్నారు. నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరానికి రూ.25 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు హరీష్ రావు అన్నారు.