
జనగామ, వెలుగు: కాళేశ్వరంపై సర్కారు అసత్య ప్రచారాలు చేస్తోందని, అబద్ధాలు మానుకుని చిన్నచిన్న సమస్యలుంటే పరిష్కరించి నీళ్లియ్యాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం మీద అనవసరంగా రాజకీయాలు చేయొద్దన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామ అసెంబ్లీ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అధ్యక్షతన బుధవారం జనగామలో జరిగింది. ఈ మీటింగ్‌లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్మోసం చేస్తోందని, సర్కారు మెడలు వంచేందుకు పార్లమెంట్ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన100 రోజుల్లోనే 420 హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని, వాటిని అమలు చేయకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల టైంలో రైతుబంధు ఇవ్వకుండా ఈసీకి కంప్లైంట్ ఇచ్చి ఆపించారని, కాంగ్రెస్ వచ్చి 60 రోజులైనా ఇంకా అందరికీ డబ్బులు పడలేదన్నారు. రైతుబంధు ఆపి ఉద్యోగులకు జీతాలు వేసినట్టు చెప్పారని, కానీ ఏడో తారీఖు వరకు కూడా జీతాలు పడలేదన్నారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడుతా అని కొందరు అంటున్నారని, రేవంత్ రెడ్డి మాటలు రాష్ట్రం పరువు తీసేలా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తేనే ఎంపీ ఎన్నికల్లో వారికి ఓటు వేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని, కాంగ్రెస్ భరతం పడతామని అన్నారు.
రేవంత్ ఒళ్లు దగ్గర పెట్టుకో: కడియం
కేసీఆర్ పై సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్లు అసహ్యంగా ఉన్నాయని, ఆయన సంస్కారహీనంగా వ్యవహరించారని స్టేషన్‌ఘన్ పూర్ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఆయన ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. జనం మార్పుకోరుకుని కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, కానీ 50 రోజుల్లోనే సర్కారు గ్రాఫ్ పడిపోతున్నదన్నారు. రెండు మూడేండ్లలో కాంగ్రెస్లీడర్లు వాళ్లలో వాళ్లే కొట్టుకుంటారని, అప్పుడు ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.