
- ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్‌ఎస్ ప్రభంజనం ఖాయం
- అద్వితీయంగా వరంగల్ మహాసభ నిర్వహణ
- మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
గజ్వేల్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంత స్పీడ్‌గా గెలిచిందో.. అంతే స్పీడ్‌గా కుప్పకూలిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో స్థానిక నాయకులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ మహాసభకు ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివస్తామంటున్నారన్నారు.
రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఆస్తులు అమ్ముదామన్నా, కుదువ పెట్టాలన్నా వీలు లేకుండా పోయిందని, గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేవుడిపై ఒట్టు పెట్టి.. ఆయననే మోసం చేసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని, అటు అసెంబ్లీలో ఇటు బయటా అబద్ధాలే చెబుతారని ఎద్దేవా చేశారు.
హామీలు ఎగ్గొట్టుడు, అబద్ధాలు చెప్పుడు, చెట్లు నరుకుడే రేవంత్‌రెడ్డి బ్రాండ్లు అని విమర్శించారు. గ్రామాల్లో ఇస్తున్న సన్నబియ్యంలో 40 శాతం నూకలే ఉన్నాయన్నారు. 20 శాతం కమిషన్ ఇస్తేనే బిల్లులు రిలీజ్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గం ఇన్‌చార్జి ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్ మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు.