2 లక్షల ఉద్యోగాల్లో 10 శాతం కూడా నింపలే : హరీశ్ రావు

2 లక్షల ఉద్యోగాల్లో 10 శాతం కూడా నింపలే : హరీశ్ రావు
  • కాంగ్రెస్​ భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ బీఆర్ఎస్ ఇచ్చిన​ నోటిఫికేషన్​లే: హరీశ్​రావు 

హైదరాబాద్​, వెలుగు: అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల జాబ్​లను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్​ పార్టీ..  ఇప్పటికీ 10 శాతం ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో 1.61 లక్షల పోస్టులను భర్తీ చేసినా తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. శనివారం హరీశ్​రావు ట్విట్టర్​వేదికగా కాంగ్రెస్​ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 50 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు కాంగ్రెస్​ ప్రభుత్వం డబ్బా కొడుతున్నదని, కానీ, ఆ ఉద్యోగాలకు తమ ప్రభుత్వమే నోటిఫికేషన్​ ఇచ్చి పరీక్షలు నిర్వహించి, సర్టిఫికెట్​ వెరిఫికేషన్ కూడా పూర్తిచేసిందని తెలిపారు. ఉద్యోగాలే కాకుండా హామీల విషయంలోనూ రేవంత్​ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని ఆరోపించారు.

సగం మంది రైతులకు రుణమాఫీ నై

రైతు రుణమాఫీని 2023 డిసెంబర్​ 9వ తేదీ నాటికి పూర్తి చేస్తామని కాంగ్రెస్​ ప్రభుత్వం హామీ ఇచ్చినా.. అర్హులైన రైతుల్లో సగానికిపైగా ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నదని హరీశ్​ రావు అన్నారు. 11 నెలలవుతున్నా  రూ.4 వేల పింఛన్​ హామీ  అమలు చేయలేదని తెలిపారు.  ‘‘18 ఏండ్లు పైబడిన మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదు. ప్రతి విద్యార్థికి రూ.5 లక్షలతో విద్యా భరోసా కార్డు ఇస్తామన్న హామీ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రతి పంటకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి.. సన్న రకాలకు మాత్రమే పరిమితం చేశారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం హామీ ఊసేలేదు. మహిళా విద్యార్థులకు ఎలక్ట్రిక్​ వాహనాల హామీ కూడా గుర్తు లేదు’’ అని అన్నారు.