నీళ్ల తరలింపుపై ప్రశ్నిస్తే మాపైనే రంకెలా? : హరీశ్ రావు

నీళ్ల తరలింపుపై ప్రశ్నిస్తే మాపైనే రంకెలా? : హరీశ్ రావు
  • పాలమూరు జిల్లా విషయంలో రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే: హరీశ్ రావు    
  • టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయి
  • కమీషన్ల కోసమే నారాయణపేట ఎత్తిపోతల స్కీమ్
  • పాలమూరు ప్రజల ఉసురుపోసుకోవద్దని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డికి ఆపడం చేతకాలేదని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. నీళ్ల తరలింపు విషయాన్ని గుర్తు చేస్తే.. తమపైనే ఆయన రంకెలేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చాయని ట్వీట్​లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పాలమూరు ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. ఆ జిల్లా విషయంలో రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే పోతిరెడ్డిపాడు నీళ్లు తరలిస్తుంటే వైఎస్ కు వంత పాడింది కాంగ్రెస్ నేతలే.

రేవంత్​కు నీటి విలువ.. నోటి విలువ తెల్వదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డుపడుతూ కేసులు వేయించిన ఘనత రేవంత్​కే దక్కుతుంది. కాంగ్రెస్ లీడర్లు వేసిన కేసులు ఎదుర్కొని 90శాతం పనులు పూర్తి చేసినం. మిగిలిన 10శాతం పనులు పూర్తి చేయకుండా పాలమూరు ప్రజల ఉసురు పోసుకుంటున్నరు. పాలమూరు ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తే జనం కేసీఆర్ పేరును తలుచుకుంటారన్న కుటిల బుద్ధితో కావాలనే పనులను పూర్తి చేయడం లేదు. 

పాలమూరు ఎత్తిపోతలు పూర్తి చేస్తే కొడంగల్, నారాయణపేటకు నీళ్లు వస్తాయి. స్వార్థ రాజకీయాలు, కమీషన్ల కోసం నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని తెరమీదకు తీసుకొచ్చిన్రు’’అని హరీశ్ ఫైర్ అయ్యారు. పాలమూరు కష్టాలు తీర్చిందే కేసీఆర్ అని అన్నారు. ‘‘పెండింగ్ ప్రాజెక్ట్​లను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్​ది. కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల్లో 2014 వరకు కేవలం 27వేల ఎకరాలే సాగైతే, ప్రాజెక్టు పనులు పూర్తిచేసి దాన్ని ఆరున్నర లక్షల ఎకరాలకు పెంచింది కేసీఆర్. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరులో దాదాపు 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించినం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తే మరో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది’’అని హరీశ్ అన్నారు.

ప్రభుత్వానికి సోయి లేదు: జగదీశ్ రెడ్డి

కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వానికి సోయి లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ జల దోపిడీని అడ్డుకోండంటూ హరీశ్ రావు సలహా ఇస్తే.. తిరిగి తమపైనే నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో వాటాకు మించి ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకెళ్తున్నదని ఆరోపించారు. సాగర్ ఎడమ కాల్వ కింద సాగు, తాగు నీటికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు.