హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. గడిచిన 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు చనిపోయారని ఆయన ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు గడప దాటడం లేదన్నారు. గురుకులాల్లో నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలుకేనని బాలల దినోత్సవం రోజున సీఎం ప్రగల్భాలు పలకారని, కానీ కార్యారణ చేపట్టలేదని విమర్శించారు.
సంగారెడ్డి గురుకుల స్కూల్లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందన్నారు. విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతుంటే, వారిని కాపాడాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ఈ చావులు ప్రభుత్వ హత్యలేనని, వీటికి సీఎం బాధ్యత వహించాలన్నారు. తమ పాలనలో రోల్ మోడల్‌గా నిలిచిన గురుకులాలు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో దిగజారుతున్నాయని అన్నారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.