- ఉద్యమకాలంలోనూ ఇలాంటి నిర్బంధాలు చూడలే
- సీఎం రేవంత్ యమ భటులను మరిపించారని విమర్శ
- కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్‌షీట్ విడుదల
హైదరాబాద్, వెలుగు: సోనియమ్మ ఆరు గ్యారంటీలు ఇస్తే.. తాను ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానని నాడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ, ఏడాదిలోనే ప్రజాస్వామ్యం అపహాస్యమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిందని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు లేదని, నియంతృత్వమే మిగిలిందన్నారు. ఉద్యమంలోనూ ఎరుగని నిర్బంధకాండను చూపిస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎమర్జెన్సీని తలపించే పాలనను అందిస్తూ యమ భటులను మరిపించారని విమర్శించారు.
రేవంత్ పాలనను క్లుప్తంగా చెప్పాలంటే ప్రతిపక్షాలకు తిట్లు, ప్రజలకు కొట్లు, దేవుళ్లపై ఒట్లు, తన వారికి దోపిడీ సొమ్ము నోట్లు అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘ఏడాది పాలన.. ఎడతెగని వంచన’ పేరుతో బీఆర్ఎస్ చార్జ్‌షీట్‌ను హరీశ్‌రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులతోనే పోలీసుల కుటుంబాలను కొట్టించిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. చదువుకునే లైబ్రరీల్లో స్టూడెంట్స్పై లాఠీచార్జి చేయించారని, నిరుద్యోగుల కన్నీళ్లతో అశోక్‌నగర్‌ను శోకనగర్గా మార్చారని తెలిపారు. బుల్డోజర్లతో ఇండ్లు కూల్చి పేదల జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. లగచర్ల బిడ్డలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పేర్కొన్నారు.
ప్రజాదర్బార్ ఒక్కరోజు బాగోతమే
సీఎంవోలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ అని మేనిఫెస్టోలో పెట్టారని, కానీ, దానిని ఒక్కరోజు బాగోతంగానే సరిపెట్టారని హరీశ్‌రావు అన్నారు. కనీసం మంత్రులు కూడా ప్రజాదర్బార్‌కు రావడం లేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలకు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తామన్న హామీని తుంగలో తొక్కారని తెలిపారు. ‘‘రాష్ట్రం దివాళా తీసిందన్న దిక్కుమాలిన ప్రచారంతో పరపతి దెబ్బతిన్నది.
ఆర్థిక వృద్ధి మందగించింది. రియల్ ఎస్టేట్ కుదేలైంది. కేసీఆర్ మార్క్ పాలన దేశానికి దిక్సూచి అయితే.. రేవంత్ మార్కు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. జీహెచ్ఎంసీ కమిషనర్లు ముగ్గురు మారారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు ముగ్గురు మారారు. ట్రాన్స్‌కో సీఎండీలను మార్చారు. శాఖల మధ్య సమన్వయం లేకుండా పోయింది. సీఎం దగ్గరున్న విద్య, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల్లో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు.
శాంతిభద్రతలు దిగజారినయ్
ప్రశాంతతకు చిరునామాగా ఉన్న రాష్ట్రం నేడు అశాంతి, అలజడితో అట్టుడుకుతున్నదని హరీశ్ రావు అన్నారు. మత ఘర్షణలు జరుగుతున్నాయని, రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని, హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని అన్నారు. ఆరు గ్యారెంటీలు అధోగతి పాలయ్యాయని తెలిపారు. సంక్షేమం అటకెక్కిందని ఆరోపించారు.
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని చెప్పారు. సాగర్ ఆయకట్టుకు సరైన సమయంలో నీళ్లివ్వట్లేదని, రైతు సంక్షేమానికి రాహుకాలం వచ్చిందని అన్నారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగుల రెక్కల కష్టంతో రేవంత్ గద్దెనెక్కారని, అవసరం తీరాక నిర్దాక్షిణ్యంగా రెక్కలు విరిచి డొక్కల్లో గుద్దారని విమర్శించారు. హైడ్రా పేరు చెప్పి విధ్వంసం సృష్టించారని అన్నారు.