
ఆదిలాబాద్, వెలుగు: ‘గత బై ఎలక్షన్ ల నుంచి కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నయ్. అందుకే హుజురాబాద్, దుబ్బాకలో కాంగ్రెస్ కు డిపాజిట్లు దక్కలేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. దీన్ని బట్టి చూస్తే ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నట్లు తెలిసిపోతుంది. నీళ్లు, నూనే మాదిరిగానే బీఆర్ఎస్, బీజేపీ కలిసే ప్రసక్తే ఉండదు. బీఆర్ఎస్ పార్టీ ఎవరికీ బీ టీం కాదు’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ డకౌట్.. కాంగ్రెస్ రనౌట్ అవుతుందని.. కేసీఆర్ సెంచరీ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లినా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరే అని ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారని పేర్కొన్నారు.
శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగుపడుతదనే క్లారిటీ ప్రజలకు ఉందన్నారు. బూతులు మాట్లాడే నాయకుల చేతిలో ఉంటే మంచిదా.. మంచి భవిష్యత్తును అందించే నాయకుల చేతిలో ఉంటే మంచిదా? అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. పదేండ్లలో రాష్ట్రం అభివృద్ధిలో అన్ని రంగాల్లో దూసుకెళ్తోందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. కార్యకర్తలు బీఆర్ఎస్ మేనిఫెస్టోను గడపగడపకు తీసుకెళ్లాలని సూచించారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే కర్నాటక గతే
కాంగ్రెస్ ను నమ్మొద్దని, ఆ పార్టీకి ఓటేస్తే కర్నాటక గతే పడుతుందని ఆయన విమర్శించారు. అక్కడ రైతులకు కనీసం 3 గంటల కరెంటు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పారాషూట్ లీడర్లకు టికెట్లు ఇవ్వడంతో ఆ పార్టీ కార్యకర్తలే ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారని, కోట్లు పెట్టి ఢిల్లీకి వెళ్లి టికెట్ తెచుకునే పరిస్థితి ఆ పార్టీలో ఉందన్నారు.
మొన్న ఆదిలాబాద్ కు వచ్చిన అమిత్ షా.. సీసీఐ గురించి మాట్లాడలేదని, ఉన్న సీసీఐని స్క్రాప్ కు అమ్మేసేందుకు కుట్ర చేస్తున్నారని హరీశ్విమర్శించారు. సభలో ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ పాల్గొన్నారు. అంతకు ముందు హరీశ్ రావు ట్నూర్ లో జరిగిన సభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. కుమ్రం భీం వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధికి రాష్ట్రం చిరునామాగా మారిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మవద్దని, మూడోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆశీర్వాద సభలో కౌన్సిల్ మాజీ చైర్మన్ స్వామి గౌడ్, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎంపీ గొడం నగేశ్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ గెలిచేది లేదు.. అధికారంలోకి వచ్చేది లేదు: హరీశ్
ఎమ్మెల్యే టికెట్లను రూ.5 కోట్లకు,10 ఎకరాల భూమికి కాంగ్రెస్ అమ్ముకుందని ఆ పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారని, అలాంటి వారి చేతుల్లోకి తెలంగాణ పోతే ఆగమవుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇలాంటి పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదని విమర్శించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసును శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి హాజరై, మాట్లాడారు.
కాంగ్రెస్ పరిస్థితి 100 సీట్లు.. 101 ధర్నాలుగా మారిందని ఎద్దేవా చేశారు. ‘‘గాంధీ భవన్‌లో ఒకరు రాళ్లు వేస్తున్నారు. మరొకరు నిప్పు పెడుతున్నారు. కాంగ్రెస్ అసమర్థ పార్టీ. తెలంగాణ ద్రోహుల చేతుల్లోకి, అవినీతిపరుల అధీనంలోకి కాంగ్రెస్ వెళ్లింది. రూ.50 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవిని కొనుకున్నాడని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించాడు. మీ ఊళ్లల్లో మీరు గెలవలేరు కానీ, కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి.. సిద్దిపేటలో నాపై పోటీ చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. మోసానికి, నయవంచనకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ’’అని హరీశ్ ఆరోపించారు.
రేషన్ దుకాణాల్లో వచ్చే మార్చి నుంచి సన్న బియ్యం ఇస్తామని తెలిపారు. కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేయాలని ప్రజలను కోరారు. స్టేషన్ ఘనపూర్ బీఆర్‌ఎస్‌కు కంచుకోట అని, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అనుభవం ఉన్న నాయకుడని హరీశ్ అన్నారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ, పార్టీ ఆదేశాల మేరకు తన విజయానికి ఎమ్మెల్యే రాజయ్య కృషి చేస్తారని నమ్ముతున్నానని చెప్పారు. తాను భూ కబ్జాలకు పాల్పడనని, అవినీతి చేయనని, ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టించనన్నారు.