కర్నాటక కాంగ్రెస్​ మోడల్​ ఫెయిల్​ : హరీశ్​రావు

నిజామాబాద్, వెలుగు: కల్లబొల్లి మాటలతో ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్​ను నమ్మొద్దని, కర్నాటకలో వారిచ్చిన హామీలు అమలు కావడం లేదని స్టేట్ ఫైనాన్స్, హెల్త్​ మినిస్టర్ ​హరీశ్​రావు పేర్కొన్నారు. శనివారం ఆయన బోధన్ ​నియోజకవర్గంలోని రెంజల్, సాటాపూర్, ఆర్మూర్​లోని మాక్లూర్, నందిపేట, అర్బన్​లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్​లలో మాట్లాడారు.‘కర్నాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి మొత్తం బస్సులు ఆపేశారు. 24 గంటల కరెంటని చెప్పి 3 గంటలు ఇస్తున్నారు. ఉచితాలకు డబ్బులేక స్టూడెంట్స్​ స్కాలర్​షిప్​లకు కోతపెట్టారు. కాంగ్రెస్​కు ఓటేసిన అక్కడి ప్రజలు ఆగమైయ్యారు.

తెలంగాణలో ఆ పరిస్థితి తీసుకురావొద్దని’ కోరారు.‘ఇంకా ఎలక్షన్ ముగియక ముందే కాంగ్రెస్​లో సీఎం కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నారు. కర్నాటక మాదిరి ఎన్నికల్లో గట్టెక్కడానికి మోసపూరిత మేనిఫెస్టోతో వస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి’ అని అన్నారు. నిజాంసాగర్ ​కెనాల్స్​ను రూ.వంద కోట్లతో బాగు చేశామన్నారు. ఎలక్షన్లు మూడొద్దుల పండగ కాదు అయిదేండ్ల ప్రజల భవిష్యత్తును నిర్ణయించేవన్నారు.ఈ పార్టీ సీసా ఇచ్చింది.. ఆ పార్టీ పైసలిచ్చింది.. అని లొంగితే బతుకులు ఆగమవుతాయన్నారు.

గవర్నమెంట్​ హాస్పిటల్స్​పై ప్రజలకు భరోసా కలిగేలా సౌలత్​లు పెంచామని అన్నారు. ఖర్చుతో కూడిన మోకాళ్ల ఆపరేషన్ ను ​ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ​అధికారంలో వచ్చిన వెంటనే జనవరి నుంచి రేషన్ ​కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో తమ అభ్యర్థులందరికీ హ్యాట్రిక్​ విజయాన్ని అందించాలని కోరారు. షకీల్​ ఆమెర్, బిగాల గణేశ్​గుప్తా, జీవన్​రెడ్డి, మేయర్​దండూ నీతూకిరణ్​ పాల్గొన్నారు.