కాంగ్రెస్​ గ్యారంటీలు గ్యారేజీకి పోయినయ్: హరీశ్​రావు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలకు చెప్పినట్టే మహారాష్ట్రలోనూ సీఎం రేవంత్​రెడ్డి అన్నీ అబద్ధాలే చెప్పారని, అక్కడి ప్రజలనూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. ‘‘ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. గ్యారంటీల అమలుకు బాండ్​ పేపర్​ కూడా రాసిచ్చారు. కానీ ఏడాదవుతున్నా గ్యారంటీలు అమలు కాలేదు. రైతు రుణమాఫీ బోగస్​.. బోనస్​ బోగస్​.. గ్యారంటీలన్నీ బోగస్. కాంగ్రెస్​గ్యారంటీలు గ్యారేజీకి పోయినయ్” అని విమర్శించారు.

ఆదివారం తెలంగాణ భవన్​లో మీడియాతో హరీశ్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ హామీల అమలుపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్​విసిరారు. ‘‘మహిళలకు నెలనెలా ఇస్తామన్న రూ.2,500 ఇప్పటికీ దిక్కులేవ్. ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.27,500 బాకీ ఉంది. 2023 డిసెంబర్​9న ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారు. 42 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్ల మేర రుణమాఫీ చేస్తామని చెప్పి, కేవలం 17 వేల కోట్లే మాఫీ చేశారు. 7 నెలల పాటు రుణమాఫీ ఆలస్యం చేయడంతో రైతులపై వడ్డీ భారం పెరిగింది” అని అన్నారు. 

రైతు భరోసా ఏదీ? 

రైతు భరోసా కింద ఇస్తామన్న ఎకరాకు రూ.15 వేలు ఏమైనయ్? అని హరీశ్ రావు ప్రశ్నించారు. రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి, అది కూడా అమలు చేయట్లేదని మండిపడ్డారు. ‘‘సన్న వడ్లకు రూ.500 బోనస్ అని చెప్పి, అవీ ఇస్తలేరు. అసలు ఉన్న వడ్లనే ప్రభుత్వం మద్దతు ధరకు కొనడం లేదు. దీంతో రైతులు తక్కువ రేటుకే దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. క్వింటాల్ కేవలం రూ.1,900కే అమ్ముకునే పరిస్థితి వచ్చింది. రేవంత్ అసమర్థ పాలనకు రోడ్ల మీదున్న వడ్ల కుప్పలే నిదర్శనం” అని అన్నారు. మధ్యతరగతి వాళ్లు కట్టుకున్న వందల ఇండ్లను కూలగొట్టిన సీఎం రేవంత్.. ఒక్క ఇల్లు అయినా కట్టారా? అని ప్రశ్నించారు. ఒక్క విద్యార్థికైనా రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చారా? అని నిలదీశారు. ‘‘నిరుద్యోగులకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఏమైంది? వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ఏది? ఇప్పటిదాకా 41 లక్షల మంది పింఛన్​దారులకు ఒక్కొక్కరికీ ప్రభుత్వం రూ.26 వేల పెన్షన్​బాకీ పడింది.

 10 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ రేవంత్​పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. నోటిఫికేషన్​ఇచ్చింది లేదు.. ఎగ్జామ్​పెట్టింది లేదు. అలాంటప్పుడు 50 వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?” అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ సర్కార్ తమ ఖాతాలో వేసుకుంటున్నదని మండిపడ్డారు. ‘‘అశోక్​నగర్​లైబ్రరీలో నిరుద్యోగులపై లాఠీచార్జ్​చేయించిన ఘనత రేవంత్​ రెడ్డిది. అర్ధరాత్రి ఆడపిల్లల్ని అరెస్ట్​ చేయించిన చరిత్ర కాంగ్రెస్​పార్టీది. జీవో 29 పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేశారు. ప్రశ్నించిన నిరుద్యోగులను అణచివేసే ప్రయత్నం చేశారు” అని మండిపడ్డారు. 

మహారాష్ట్రకు డబ్బు మూటలు.. 

ఎన్నికల హామీలను ఎగ్గొట్టడమే కాంగ్రెస్​నైజంగా మారిందని హరీశ్ రావు అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు గ్యారంటీలిచ్చిన కాంగ్రెస్.. గెలిచాక ఆ గ్యారంటీలను గ్యారేజీకి పంపిందని విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్​గాంధీ మాట అంటూ హామీలిచ్చారని.. ఇప్పుడు ఆ గాంధీలు ఎక్కడికిపోయారని ప్రశ్నించారు. ‘‘పోలీస్​ కానిస్టేబుళ్లు రోడ్ల మీదకు వచ్చే దుస్థితి ఏర్పడింది. హాస్టళ్లలో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు. మహిళలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని చెబుతున్నారు. 

కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన జీవోనే రాలేదు. 24 గంటల ఉచిత కరెంట్​ఇస్తున్నామంటూ మరో అబద్ధం చెబుతున్నారు. కేసీఆర్​ఇచ్చిన కరెంట్​ను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. మహారాష్ట్ర ప్రజలను రేవంత్ తప్పుదోవ పట్టిస్తున్నారు. అక్కడకు డబ్బులు పంపించే పనిలో రేవంత్​బిజీగా ఉన్నారు. పాలనను గాలికి వదిలి సీఎం, మంత్రులు గాలిమోటార్లలో పక్క రాష్ట్రాల బాట పట్టారు” అని విమర్శించారు. మహారాష్ట్రలో ఏ పార్టీకీ అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రచారం చేయబోమని.. తమకు అక్కడ భాగం లేదని హరీశ్ చెప్పారు.