హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో హైడ్రా కూల్చివేతలో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న హోంగార్డు గోపాల్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పరామర్శించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో హరీశ్ మాట్లాడుతూ ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఒక్క పోలీసు ఉన్నతాధికారి కూడా బాధితుడిని పరామర్శించలేదని మండిపడ్డారు. హోంగార్డులు అంటే అంత చులకనా? అని నిలదీశారు. ఇప్పటి వరకు హోంగార్డు కుటుంబం గోపాల్ చికిత్సకు రూ.లక్ష ఖర్చు చేసిందని, ప్రభుత్వం వైద్యఖర్చులు భరించడం లేదని ఆరోపించారు.
ఎన్డీఆర్ఎఫ్నిధుల కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం
ఎన్డీఆర్ఎఫ్ నిధుల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే ఒరిగిందేమిటని ఒక ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. ఎన్డీఆర్ఎఫ్ నిధుల కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే మనకు సగం కన్నా తక్కువ కేటాయింపులు చేశారన్నారు.