కాంగ్రెస్​ నెరవేర్చని హామీలపై చర్చ పెట్టండి : కార్యకర్తలకు హరీశ్ ​రావు పిలుపు

  • ‘ఉచితాలు’ నెరవేర్చిన తర్వాతే లోక్​సభ ఎన్నికల్లో ఓట్లు అడగాలని డిమాండ్​
  • ‘స్థానిక’ ఎన్నికలు ఇప్పట్లో ఉండవన్న మాజీ మంత్రి
  • ఇప్పటి నుంచే పైసలు ఖర్చు చేయొద్దని క్యాడర్​కు సలహా

దుబ్బాక, వెలుగు : కాంగ్రెస్​ ప్రభుత్వం మాయ మాటలతో అధికారంలోకి వచ్చిందని, నెరవేర్చని హామీలపై ప్రజల్లో చర్చ పెట్టాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్​రావు బీఆర్​ఎస్​ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డి అధ్యక్షతన జరిగిన కృతజ్ఞత సభకు ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన డిసెంబర్​9 నుంచి కాంగ్రెస్​ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.

‘ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్​ఇస్తమని కరెంట్​బిల్లు కట్టొద్దన్నరు. రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్​గా రూ. 500 ఇస్తమని..వడ్లు అమ్మొద్దన్నరు. రూ. 2వేల పింఛన్​ను రూ. 4 వేలకు పెంచుతమన్నరు. రైతుబంధు కింద రూ.15 వేలు ఇస్తమన్నరు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నరు.  వాటినే వెంటనే అమలు చేయాలని బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం’ అని అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్​ ఇచ్చిన ఉచిత హామీలను నెరవేర్చిన తర్వాతే లోక్​సభ ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో వచ్చేటట్లు లేవని, బీఆర్ఎస్​ ఆశావాహులు ఇప్పటి నుంచే ఖర్చులు చేయొద్దన్నారు.  గత ఎన్నికల్లో తెలిసో తెలియకో జరిగిన తప్పులను సరిదిద్దుకుందామని, కింద పడడం లేవడానికేనన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గిరిజన యూనివర్శిటీని ఇస్తానని చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, జడ్పీ చైర్​ పర్సన్​ వేలేటి రోజా శర్మ, ఆయా మండాలల ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్​లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.