
- రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టని పాపం కాంగ్రెస్ పార్టీదే: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీనేనని ఆరోపించారు. ఈ పార్టీ నిర్లక్ష్యం వల్లే కృష్ణా జలాల్లో 299 టీఎంసీలను మాత్రమే పంచారన్నారు. రాష్ట్రంలో ఎక్కువ ప్రాజెక్టులు లేవు కాబట్టే.. తాత్కాలికంగా 299 టీఎంసీలే కేటాయించారని తెలిపారు.
రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టని పాపం కాంగ్రెస్ పార్టీదేనని మండిపడ్డారు. శనివారం అసెంబ్లీలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ‘‘పోతిరెడ్డిపాడు కోసం పీజేఆర్ కొట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. ఉత్తమ్.. చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి, కృష్ణా నీటిలో తెలంగాణకు అన్యాయం చేశారు. శ్రీశైలం ఖాళీ చేసేలా ద్రోహం చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డినే. 573 టీఎంసీల నీళ్లను సెక్షన్ 3 ద్వారా తెచ్చింది బీఆర్‌ఎస్ పార్టీనే. ద్రోహ చరిత్ర ఉత్తమ్‌దైతే.. త్యాగ చరిత్ర బీఆర్ఎస్‌ది.
నల్గొండలో పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్సే కారణం. సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ కట్టడం వల్లే ఖమ్మంకు నీళ్లు ఇవ్వగలిగాం” అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావును కోరుకోవడం తప్పన్నారు. అందుకే సీఎం స్పీచ్‌ను తాము బహిష్కరించామని చెప్పారు.
మరోవైపు, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తేయాలని హరీశ్ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేతలు స్పీకర్‌కు వినతి పత్రం అందజేశారు. స్పీకర్ పట్ల జగదీశ్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదన్నారు. సస్పెన్షన్‌పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం గానీ, బీఆర్‌ఎస్ పార్టీ వివరణ గానీ, జగదీశ్ రెడ్డి వివరణను కూడా తీసుకోకుండా ఆయనపై సస్పెన్షన్ విధించారని మండిపడ్డారు.