హైడ్రా పేరుతో పల్లా ఆస్తులు కూల్చేందుకు సర్కార్ కుట్ర: హరీశ్ రావు

 

  • అన్ని అనుమతులతోనే కాలేజీలు, హాస్పిటల్ కట్టిండు
  • హైడ్రా పేరిట వాటిని కూల్చేందుకు సర్కార్ కుట్ర  
  • కబ్జా చేసినట్లయితే నోటీసులు ఇచ్చి నిరూపించాలె
  • రాష్ట్రంలో విష జ్వరాలు వ్యాప్తి.. హెల్త్ ఎమర్జెన్సీప్రకటించాలని సూచన 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కార్ హైడ్రా పేరుతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌‌రావు ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌‌‌రెడ్డితో కలిసి మీడియాతో హరీశ్ రావు మాట్లాడారు. పల్లా ఉద్యమకారుడు, నిజాయతీపరుడు అని, ఇంచు భూమిని కూడా కబ్జా చేయలేదన్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక పల్లాపై, ఆయన కుటుంబసభ్యులపై ఆరు కేసులు పెట్టిందన్నారు. నోటీసులు ఇవ్వకుండా హైడ్రా పేరిట ఆయన ఆస్తులను కూల్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇంచు ప్రభుత్వ భూమిని కూడా పల్లా ఆక్రమించుకోలేదని, అన్ని పర్మిషన్లతో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు, హాస్పిటల్ నిర్మించారని చెప్పారు. 

ఇవి బఫర్ జోన్ లేదా ఎఫ్టీఎల్ పరిధిలో లేవని అప్పటి కలెక్టర్ క్లియరెన్స్ కూడా ఇచ్చారని తెలిపారు. హెచ్ఎండీఏ పర్మిషన్ కూడా ఉందన్నారు. వీటిని కూల్చేస్తే స్టూడెంట్లు, పేషెంట్లు ఇబ్బందులు పడతారన్నారు. ఒకవేళ కబ్జా జరిగిందని భావిస్తే నోటీసులు ఇచ్చి నిరూపించాక కూల్చేయాలన్నారు. అధికారులు అత్యుత్సాహానికి పోవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతంగా ఉండదని హెచ్చరించారు. ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతుంటే, ప్రభుత్వం ప్రత్యర్థులపై విషం చిమ్ముతోందని హరీశ్ ఆరోపించారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవన్నట్టుగా సీఎం తీరు ఉందన్నారు.  

హెల్త్ ఎమర్జన్సీ పెట్టాలె..

రాష్ట్రంలో ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతున్నారని, ప్రతి ఇంట్లోనూ ఇద్దరు జ్వరంతో ఉన్నారని హరీశ్ రావు తెలిపారు. డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వ్యాపిస్తున్నాయన్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో ఒక్కో బెడ్డుపై ముగ్గురు పేషెంట్లను పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారని, ప్రైవేటు హాస్పిటళ్లలోనూ బెడ్లు దొరకట్లేదన్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టి పటి ష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. 

రుణమాఫీపై ప్రభుత్వం సాకులు చెప్తోందని విమర్శించారు. వెంటనే రుణమాఫీ  పూర్తి చేయాలని, రైతు భరోసా నిధులు విడుదల చేయా లని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్​కు అప్పుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తాము 9 ఏండ్ల లో రూ.4.26 లక్షల కోట్ల అప్పులు చేశామని.. ప్రస్తు త సర్కార్ మాత్రం 8 నెలల్లోనే రూ.65 వేల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఈ లెక్కన 5 ఏండ్లలోనే రూ.4.87 లక్షల కోట్ల అప్పుచేసే చాన్స్​ ఉందన్నారు.