హైదరాబాద్: తెలంగాణలో ఆర్ఎస్ బ్రదర్స్ సర్కారు నడుస్తోందని, రేవంత్ రెడ్డికి విషం తప్ప విజన్ లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఆర్ఎస్ అంటే రేవంత్, సంజయ్ సర్కారు అని చెప్పారు. రేవంత్ రెడ్డి తానా అంటే.. బండి సంజయ్ తందానా అంటున్నారని అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జన్వాడ ఫాంహౌస్‌పై పోలీసుల దాడి ప్రభుత్వ కుట్ర అని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేకనే.. కేటీఆర్‌పై బురద జల్లుతున్నారని ఆరోపించారు.
ALSO READ : కేటీఆర్.. నార్కోటిక్ టెస్టులు చేయించుకో: షబ్బీర్ అలీ
అది ఫాంహౌస్ కాదని, రాజ్ పాకాల ఇల్లు అని స్పష్టం చేశారు. రేవ్ పార్టీ అని అసత్య ప్రచారం చేస్తున్నారని వాస్తవానికి అది ఫ్యామిలీ ఫంక్షన్ అని చెప్పారు. రేవ్ పార్టీలో పిల్లలు, వృద్ధులు ఉంటారా..? అని ప్రశ్నించారు. అక్కడ కేటీఆర్ సతీమణి లేరని అన్నారు. బాధ్యత కలిగిన కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారా..? రేవంత్ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారా..? అని ప్రశ్నించారు.