హైదరాబాద్: రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నేత, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చేపట్టిన పాదయాత్ర ట్రైలర్ మాత్రమేనని.. ప్రభుత్వానికి త్వరలో 70 MM సినిమా చూపిస్తామని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రైతు సమస్యలపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మంగళవారం చేపట్టిన పాదయాత్రలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. రైతుల కష్టాలు చూడలేక ఎమ్మెల్యే సంజయ్ కోరుట్ల నుంచి జగిత్యాల వరకు పాదయాత్ర చేపట్టారని తెలిపారు.
నాడు డాక్టర్‌గా నేడు, ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ మంచి పేరు తెచ్చుకుంటున్నారని కొనియాడారు. కేసీఆర్‌కు దేశంలోనే రైతు సీఎం అనే పేరు వస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బూతుల సీఎం అనే పేరు వచ్చిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడటం తప్ప ఒక్క అక్కరకొచ్చే పనైనా చేసిండా..? అని ప్రశ్నించారు. జగిత్యాల అంటే జైత్రయాత్ర గుర్తుకు వస్తుందని.. అదే జగిత్యాలలో మా ఎమ్మెల్యే పూరించిన సమర శంఖంతోనైనా సీఎం రేవంత్ రెడ్డి కళ్లు తెరవాలని అన్నారు.
రైతుల వడ్లు లోడు ఎత్తమంటే.. రేవంత్ ఏమో డబ్బు మూటల లోడ్ మహారాష్ట్రకు ఎత్తుతున్నాడని సెటైర్ వేశారు. మూసీ దగ్గర కాదు.. కూలిన ఇండ్ల దగ్గర రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఇండ్లు కూలిన చోట పాదయాత్ర చేయాలని.. అక్కడికి మేం వస్తామని ఛాలెంజ్ చేశారు. మూసీ కంపు కంటే సీఎం రేవంత్ రెడ్డి నోటి కంపు ఎక్కువని విమర్శించారు.
ఇవాళ వేములవాడకు పోయి మొక్కి వచ్చినా.. ఇక్కడి నుంచి ధర్మపురి, కొండగట్టు, కోటిలింగా దేవుళ్లకు మొక్కుతున్నా. రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు తగలకుండా చూడమని ఆ దేవుళ్లను వేడుకుంటున్నానని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళల్ ఉచిత బస్ స్కీమ్ తప్ప.. మిగిలిన అన్నీ గ్యారెంటీలు తుస్సేనని ఎద్దేవా చేశారు. రైతు బంధుకు, రుణమాఫీకి లేని పైసలు.. మూసీ ప్రక్షాళనకు ఎలా వస్తాయి..? కాంగ్రెస్‌కు మాటలెక్కువ, చేతలు తక్కువని విమర్శించారు.