- కేంద్రంలో ఎన్డీఏ, ఇండియా కూటమికి మెజార్టీ రాదు: హరీశ్ రావు
- కేసీఆర్ ప్రధాని అయితడో, లేదో ఇప్పుడే చెప్పలేం
- హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కుట్ర చేస్తున్నరని కామెంట్
హైదరాబాద్, వెలుగు : కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఎన్డీఏ, కాంగ్రెస్ ఇండియా కూటమికి అవసరమైనన్ని సీట్లు రావని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈసారి కేంద్రంలో ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే ఏర్పడుతుందని, ప్రాంతీయ పార్టీలకు చెందిన వ్యక్తే ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కేసీఆర్ ప్రధాని అవుతారో.. కారో ఇప్పుడే చెప్పలేనని, ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి దీనిపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
శనివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్‌లో హరీశ్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చెప్పిన మార్పు మొదలైందని.. కరెంట్ కోతలు, నీటి కష్టాలు స్టార్ట్ అయ్యాయని ఎద్దేవా చేశారు. ‘ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు తగ్గిపోయాయి. ప్రజా పాలన అని చెప్పి, ప్రతిపక్షాల కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లను నింపుతున్నారు.
కొత్త పథకాలు రాలేదు, ఉన్న పథకాల్లో కోతలు వచ్చాయి. ఐదు గ్యారంటీలు అమలు చేశామని అబద్ధాలు చెప్తున్నారు. గృహజ్యోతి పాక్షికంగా అమలు చేశారు. మిగతా గ్యారంటీలు పత్తా లేకుండా పోయాయి”అని హరీశ్ దుయ్యబట్టారు.
కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 సీట్లు..
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని హరీశ్‌రావు ఆరోపించారు. చెరో 8 ఎంపీ సీట్లు గెలుచుకునేలా ఆ రెండు పార్టీలు ఒప్పందం చేసుకుని, ఇందుకు అనుగుణంగా అభ్యర్థులను నిలబెట్టాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని, ఇదే విషయాన్ని ఆ పార్టీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సహా పలువురు చెప్పారని, ఈ వ్యాఖ్యలను రేవంత్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.
తాను ఏక్‌నాథ్ షిండే అయ్యే వ్యక్తిని కాదని, పదవుల కంటే తనకు క్యారెక్టర్ ముఖ్యమన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కుట్ర చేస్తున్నారని, పార్లమెంటులో బీఆర్‌ఎస్ ఎంపీలుంటేనే ఈ కుట్రను అడ్డుకుంటారన్నారు.