ఫోన్ ట్యాపింగ్​కేసులో హరీశ్​రావుపై ఎంక్వైరీ చేయొచ్చు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: హరీశ్ రావు మంత్రిగా ఉన్నప్పుడు తన, తన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్‌‌ చేయించారంటూ పంజాగుట్ట పోలీస్‌‌స్టేషన్‌‎లో జి.చక్రధర్‌‌గౌడ్‌‌ పెట్టిన కేసు దర్యాప్తు నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. గౌడ్‌‌ ఫిర్యాదుపై ఎంక్వైరీని అడ్డుకోబోమని స్పష్టం చేసింది. అయితే, ఆ కేసులో హరీశ్ రావును అరెస్టు చేయొద్దని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గౌడ్‌‌ ఫిర్యాదుపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌‌ఐఆర్‌‌ను సవాలు చేస్తూ హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. 

తదుపరి విచారణలోగా కౌంటర్‌‌ దాఖలు చేయాలని ఫిర్యాదుదారు చక్రధర్‌‌గౌడ్‌‌కు నోటీసులు జారీ చేస్తూ వాయిదా వేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. రాజకీయ కక్షతో తనపై చక్రధర్‌‌గౌడ్‌‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పీఎస్‌‌లో నమోదు చేసిన ‘ట్యాపింగ్‌‌’ కేసు అభియోగాల ఎఫ్‌‌ఐఆర్‌‌ను కొట్టివేయాలని హరీశ్ రావు పిటిషన్‌‌ దాఖలు చేశారు.

నిరాధార ఆరోపణలని.. దర్యాప్తుపై స్టే ఇవ్వడంతోపాటు అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కూడా కోరారు. గురువారం ఈ పిటిషన్‌‌ను జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ విచారణ చేపట్టారు.