
నిర్మాతగా ‘లక్కీ లక్ష్మణ్’ చిత్రాన్ని రూపొందించిన హరిత గోగినేని.. ‘ఫియర్’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. వేదిక లీడ్ రోల్‌లో నటించిన ఈ మూవీ డిసెంబర్ 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హరిత మాట్లాడుతూ ‘ఇది రెగ్యులర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఉంటూనే.. సరికొత్త అనుభూతిని ఇస్తుంది. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేందుకు ఇష్టపడరు. కానీ మా సినిమా చిన్న పిల్లలతో సహా అందరికీ నచ్చేలా ఉంటుంది. నేను అనుకున్న పాత్రలో వేదిక పర్ఫెక్ట్‌గా నటించింది.
ఆమె పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎంతో సంతృప్తిగా అనిపించింది. అలాగే అరవింద్ కృష్ణ క్యారెక్టర్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమా మేకింగ్ పక్కా ప్లానింగ్‌తో చేశా. మొత్తం 2 గంటల ఫుటేజ్ వస్తే.. 8 నిమిషాలు ఎడిటింగ్‌లో తీసేశాం. డైరెక్టర్ క్లారిటీగా ఉంటే మేకింగ్‌లో ఎలాంటి వేస్టేజ్ ఉండదు. నిర్మాత మీద భారం పడదు. మొదట దీనికి ‘భయం’ అనే టైటిల్ అనుకున్నాం. అన్ని భాషలకు రీచింగ్ బాగుంటుందని ‘ఫియర్’గా మార్చాం. అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో కూడా గుర్తింపు పొందడానికి టైటిల్ ఒక కారణమైంది. ఫిలిం ఫెస్టివల్స్‌లో 70కిపైగా అవార్డ్స్ వచ్చినప్పటికీ, మన తెలుగు ఆడియెన్స్‌కు నచ్చడం ఎక్కువ సంతోషాన్నిస్తుంది’ అని చెప్పారు.