హరితహారం పథకంలో 15 వేల మొక్కలు నాటితే.. ఒక్కటీ బతకలే!

హరితహారం పథకంలో 15 వేల మొక్కలు నాటితే.. ఒక్కటీ బతకలే!
  • అధికారుల నిర్లక్ష్యానికి ఎండిపోయిన పల్లె ప్రకృతి వనాలు 

కుభీర్, వెలుగు: హరితహారం పథకంలో భాగంగా గత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాలు అధికారుల నిర్లక్ష్యంతో ఎండిపోతున్నాయి. కుభీర్​ మండలంలో 41 గ్రామపంచాయతీ పరిధిలో జామ్​గాం, కస్రా, బెల్గాం గ్రామపంచాయతీలను సెలెక్ట్ చేశారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ. 25 లక్షల ఎస్టిమేషన్ తో సుమారు రూ.75 లక్షలతో ఒక్కో గ్రామంలో ఐదెకరాల చొప్పున మొత్తం 15 ఎక రాల్లో 15 వేల మొక్కలు నాటారు. అప్పటి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చేతుల మీదుగా ఆర్భాటంగా మొక్కలు నాటి పనులను ప్రారంభించారు.

కానీ ఆ తర్వాత నిర్వహణ గాలికి వదిలేయడంతో ఆ మొక్కలు పూర్తిగా ఎండిపోయి ఆనవాళ్లు లేకుండా పోయాయి. లక్షలు ఖర్చు చేసి ప్రారంభించిన ఈ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోయింది. ఉన్నతాధికారులు పరిశీలనకు వచ్చినప్పుడు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పల్లె ప్రకృతి వనాలపై దృష్టి పెట్టాలని, మొక్కలు ఎండిపోవడానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.