- హర్లీన్ అదరహో
- 115 రన్స్ తో వెస్టిండీస్‌పై గెలుపు
- 2–0తో సిరీస్ సొంతం
వడోదరా : సొంతగడ్డపై ఇండియా విమెన్స్ దుమ్మురేపుతోంది. హర్లీన్ డియోల్ (103 బాల్స్‌లో 16 ఫోర్లతో 115) కెరీర్‌లో తొలి సెంచరీతో విజృంభించడంతో వన్డే ఫార్మాట్‌లో తమ హయ్యెస్ట్ స్కోరు రికార్డును సమం చేస్తూ వెస్టిండీస్‌ను మరోసారి చిత్తు చేసింది. ప్రతికా రావల్ (76), స్మృతి మంధాన (53), జెమీమా రొడ్రిగ్స్ (52) ఫిఫ్టీలు కొట్టడంతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 115 రన్స్ తేడాతో విండీస్‌పై గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. టాస్ నెగ్గిన ఇండియా 50 ఓవర్లలో 358/5 స్కోరు చేసింది.
దాంతో 2017లో ఐర్లాండ్‌పై చేసిన తమ అత్యధిక స్కోరు(358/5) రికార్డును సమం చేసింది. ఛేజింగ్‌లో విండీస్ 46.2 ఓవర్లలో 243 రన్స్‌కు ఆలౌటైంది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (106) సెంచరీ చేసినా ప్రయోజనం దక్కలేదు. ఇండియా బౌలర్లు ప్రియా మిశ్రా (3/49), దీప్తి శర్మ (2/40), టిటాస్ సాధు (2/42), ప్రతిక రావల్ (2/37) సూపర్ బౌలింగ్‌తో కరీబియన్లను కట్టడి చేశారు. క్వియానా (15), క్రాఫ్టన్ (13), రషాదా (0), దియోంద్ర డాటిన్ (10) ఫెయిల్ కావడంతో విండీస్ 69/4తో కష్టాల్లో పడింది.
ఈ దశలో హేలీ క్యాంప్‌బెల్ (38) ఐదో వికెట్‌కు 112 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ 34వ ఓవర్‌లో సాధు.. క్యాంప్‌బెల్‌ను ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత వరుస విరామాల్లో అలెనీ (0), హేలీ వెనుదిరగడంతో విండీస్ ఓటమి ఖాయం అయ్యింది. డియోల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. శుక్రవారం ఇరుజట్ల మధ్య మూడో వన్డే జరగనుంది.
ధనాధన్.. ఫటాఫట్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఓపెనర్లు మంధాన, ప్రతిక అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఈ ఇద్దరు పోటీపడి బౌండ్రీలు, సిక్స్‌లు కొట్టడంతో తొలి వికెట్‌కు 110 రన్స్ జతయ్యాయి. అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన మంధాన 17వ ఓవర్‌లో అనూహ్యంగా రనౌటైనా... వన్‌డౌన్‌లో వచ్చిన హర్లీన్ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపెట్టింది. ఓవర్‌కో ఫోర్ చొప్పున గ్రౌండ్ నలుమూలల భారీ షాట్లతో రెచ్చిపోయింది. ఈ క్రమంలో 62 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ సాధించింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన ప్రతికకూడా ఎక్కడా తగ్గలేదు.
ఈ ఇద్దరు పేస్, స్పిన్ అనే తేడా లేకుండా ప్రతి బౌలర్‌ను ఉతికేశారు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 62 రన్స్ జోడించి ప్రతిక వెనుదిరిగింది. ఆ వెంటనే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (22) కూడా ఔట్ కావడంతో ఇండియా 215/3తో నిలిచింది. ఈ దశలో వచ్చిన జెమీమా.. హర్లీన్‌కు చక్కని సహకారం అందించింది. ఈ ఇద్దరు టీ20 తరహా బ్యాటింగ్‌తో విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో హర్లీన్ 98 బాల్స్‌లోనే సెంచరీ పూర్తి చేసింది.
కొద్దిసేపటికే జోసెఫ్ (1/27) బౌలింగ్‌లో భారీ షాట్‌కు ట్రై చేసి ఔట్ కావడంతో నాలుగో వికెట్‌కు 71 బాల్స్‌లోనే 116 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. చివర్లో రిచా ఘోష్ (13 నాటౌట్) మెల్లగా ఆడినా జెమీమా మాత్రం దుమ్మురేపింది. 34 బాల్స్‌లోనే ఫిఫ్టీ కొట్టడంతో ఇండియా భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. విండీస్ బౌలర్లలో డాటిన్, ఫ్లెచర్, జైదా జేమ్స్ తలో వికెట్ తీశారు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా : 50 ఓవర్లలో 358/5 (హర్లీన్ 115, ప్రతిక 76, స్మృతి 53, ఫ్లెచర్ 1/38). వెస్టిండీస్ : 46.2 ఓవర్లలో 243 (హేలీ మాథ్యూస్ 106, ప్రియా మిశ్రా 3/49).