రోడ్డు మీద బండి నడపాలంటే కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. లేదనుకోండి ట్రాఫిక్ పోలీసులు మన జేబుకు చిల్లు పెట్టేస్తారు. కానీ, హార్లే డేవిడ్సన్ తయారు చేసిన రెండు బైకులతో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే రోడ్డు మీద రయ్యున దూసుకెళ్లిపోవచ్చట. గత వారం కొలరాడోలో నిర్వహించిన ఎక్స్ గేమ్స్ కార్యక్రమంలో ఆ మోడళ్లను జనానికి చూపించింది. నిజానికి హార్లే డేవిడ్సన్ అంటేనే ఓ బ్రాండ్. సామాన్యుడికి అందనంత దూరంలో ఉండే బ్రాండ్. అందుకేనేమో, ఈ మధ్య కాలంలో ఆ కంపెనీ అమ్మకాలు తగ్గాయట. దాని నుంచి బయటపడేందుకు ఏం చేయాలో పాలుపోని సంస్థ.. ఇప్పుడు ఎలక్ట్రిక్ బండ్లపై దృష్టి పెట్టినట్టుంది.
ఆ మధ్య లైవ్ వైర్ అనే ఎలక్ట్రిక్ బైకును సంస్థ విడుదల చేసింది ఈ సంస్థ. తాజాగా ఈ–స్కూటర్ల మోడళ్లను వెల్లడించింది. హార్లే బండ్లు నడుపుతున్నోళ్లలో 46 శాతం మంది 50 ఏళ్ల పైబడినోళ్లనట. 10 శాతం మందే 30–34 ఏళ్ల యువకులు వాటిని నడుపుతున్నారట. అందుకే యువతను దృష్టిలో పెట్టుకునే ఈ రెండు మోడళ్లను హార్లే తయారు చేసింది. ఒక బండి మామూలు స్కూటర్ అయితే, ఇంకో బండేమో కొండకోనల్లో నడిపేందుకు వీలుగా తయారు చేసినది. ఈ రెండు బండ్ల ఫీచర్లు, ధరను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. అతి త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తారని చెబుతున్నారు.
గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 2,28,051 బైకులను అమ్మామని, 2017తో పోలిస్తే అమ్మకాలు 6.1 శాతం పడిపోయాయని కంపెనీ ఇటీవల వెల్లడించింది. అందుకే యువతను ఆకర్షించేలా ఈ కొత్త మోడళ్లను తీసుకొస్తున్నట్టు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్ ల కోసం కంపెనీ సుమారు ₹356 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు వెల్లడించాయి.