ఆట కంటే.. యాటిట్యూడ్ ఎక్కువైంది: భారత క్రికెటర్ల తీరును తప్పుబట్టిన డయానా ఎడుల్జీ

ఆట కంటే.. యాటిట్యూడ్ ఎక్కువైంది: భారత క్రికెటర్ల తీరును తప్పుబట్టిన డయానా  ఎడుల్జీ

అంపైర్ vs హర్మన్ ప్రీత్ కౌర్ వివాదం భారత క్రికెట్‌ను అప్రతిష్ట పాలు చేస్తోంది. బంగ్లా పర్యటనలో ఈ మహిళా కెప్టెన్ అతి ప్రవర్తన భారత క్రికెట్‌కు మాయని మచ్చగా మిగిలిపోవటమే కాకుండా.. క్రికెటర్లందరూ మాటలు పడాల్సి వస్తోంది.

అంపైర్లు, బంగ్లా మహిళా క్రికెటర్ల పట్ల టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అమర్యాదగా వ్యవహరించిన సంగతి అందరికీ విదితమే. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో హర్మన్‌ప్రీత్.. బంగ్లా మహిళా క్రికెటర్లను హేళన చేసి మాట్లాడింది. ఫోటోలు దిగడానికి వారు అర్హులు కారంటూ అంపైర్లను పిలిస్తే.. వారితో కలిసి ఫోటోలు దిగుదామంటూ తక్కువ చేసి మాట్లాడింది. ఈ మాటలను అవమానంగా భావించిన బంగ్లా మహిళా క్రికెటర్లు తల దించుకొని డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లిపోయారు.

అంపైర్లతో హర్మన్‌ప్రీత్ వ్యవహరించిన తీరు తనకు చాలా బాధ కలిగించిందని భారత మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీ చెప్పుకొచ్చింది. అందుకు బీసీసీఐ అత్యుత్సాహమే కారణమని ఇండైరెక్ట్‌గా వ్యాఖ్యానించింది. అంతేకాదు.. భారత క్రికెటర్లు ఆటలో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. యాటిట్యూడ్‌లో మాత్రం మంచి పురోగతి సాధిస్తున్నారంటూ టీమిండియా క్రికెటర్ల అతి ప్రవర్తనను ఆమె తప్పుబట్టింది.

అంపైర్ల మనసుకు నొప్పి కలిగించారు. 

"నేను చాలా కాలంగా క్రికెట్ చూస్తున్నా.. కానీ ఎన్నడూ ఇలాంటిది చూడలేదు. బంగ్లాదేశ్ జట్టుతో పోజులివ్వడానికి  హర్మన్‌ప్రీత్.. అంపైర్‌లను పిలవడం చాలా బాధాకరం. వారు బంగ్లాదేశ్ జట్టులో భాగమన్నట్లు మాట్లాడటం సరికాదు. ఈ విధంగా పిలవటం వల్ల వారి మనసుకు నొప్పి కలిగించారు. ఆ మ్యాచ్ విజువల్స్ చూసి నేను చాలా బాధపడ్డా."

బీసీసీఐ సకల సౌకర్యాలు కల్పిస్తోంది

"ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం. బీసీసీఐ క్రికెటర్లకు సకల సౌకర్యాలు కల్పిస్తోంది. కానీ ఆటగాళ్లు మాత్రం బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆటపై దృష్టి పెట్టకుండా స్టార్‌లలా ప్రవర్తిస్తున్నారు. అలాంటి ప్రవర్తనను అంగీకరించకూడదు. ఇప్పటికైనా బీసీసీఐ మేల్కోవాలి. సరైన చర్యలు తీసుకోవాలి.." అని ఎడుల్జీ తన కాలమ్‌లో రాసుకొచ్చారు.