- మీడియా సమావేశంలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్
- ఆమె దేశాన్ని సమర్థంగా ముందుకు నడపగలదని ధీమా
- మరోసారి తడబడ్డ అగ్రరాజ్య అధ్యక్షుడు.. ట్రంప్ చురకలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షురాలిగా పనిచేసేందుకు వైస్‌ప్రెసిడెంట్ కమలా హారిస్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని ప్రెసిడెంట్ జో బైడెన్ తెలిపారు. ఆమె సమర్థవంతంగా దేశాన్ని ముందుకు నడపగలరని ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఆమెను ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేశానని చెప్పారు. నాటో కూటమి దేశాల వార్షిక సదస్సు ముగిసన తర్వాత వాషింగ్టన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
విమెన్బాడీల స్వేచ్ఛతోపాటు బోర్డులో ఏ సమస్యనైనా పరిష్కరించే సత్తా హారిస్‌కు ఉన్నదని బైడెన్ ప్రశంసించారు. సెనేట్‌లోనే ఆమె ఫస్ట్ రేట్ పర్సన్ అని, చాలా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ అర్హతలు లేకుంటే హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేసేవాడినే కాదని అన్నారు. అలాగే, ఈసారి తాను పోటీకి అర్హుడినని.. రేసులో కొనసాగుతానని చెప్పారు. అనుకున్న పని పూర్తిచేసేందుకే బరిలోకి దిగానని, కచ్చితంగా గెలిచి తీరుతానని జో బైడెన్ ధీమా వ్యక్తం చేశారు.
వైస్ ప్రెసిడెంట్ ట్రంప్ అంటూ తడబాటు
ప్రెసిడెంట్ బైడెన్ మరోసారి తడబడ్డారు. అధ్యక్ష స్థానానికి కమలా హారిస్‌కు అర్హతలున్నాయా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ట్రంప్‌కు ఆ అర్హతలు లేకుంటే ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసేవాడినే కాదనడంతో బైడెన్ మానసిక స్థితిపై మరోసారి చర్చనీయాంశంగా మారింది. హారిస్‌కు బదులుగా ట్రంప్అని పలకడంతో సోషల్ మీడియాలో ఆయనపై సెటైర్లు పేలాయి. నాటో సమావేశాల్లోనూ ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ అని బైడెన్ అనడంతో అక్కడున్న వివిధ దేశాల ప్రతినిధులు అవాక్కయ్యారు. కాగా, సోషల్‌సైట్ ట్రూత్‌లో బైడెన్‌కు డొనాల్డ్ ట్రంప్ చురకలంటించారు. ‘‘నన్ను ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేశారా.. గ్రేట్ జాజ్ జో” అని వ్యాఖ్యానించారు.