- షేక్ హ్యాండ్స్ తో మొదలుపెట్టి.. తీవ్ర విమర్శలు
- ట్రంప్ గెలిస్తే.. అమెరికాను చైనాకు అమ్మేస్తారన్న కమల
- కమల గెలిస్తే.. ఇజ్రాయెల్ మాయమవుతుందన్న ట్రంప్
ఫిలడెల్ఫియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి డిబేట్ వాడీవేడిగా సాగింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9 గంటలకు ఫిలడెల్ఫియా సిటీలోని నేషనల్ కాన్ స్టిట్యూషనల్ సెంటర్లో ఏబీసీ న్యూస్ మీడియా సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైన డిబేట్లో ఇద్దరు అభ్యర్థులు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చారు. ముందుగా నవ్వుతూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్న ఇద్దరు నేతలు డిబేట్‌ను ప్రారంభించిన వెంటనే పరస్పరం విమర్శల దాడి మొదలుపెట్టారు. ‘‘నువ్వు మార్క్సిస్టువి..” అని కమలపై ట్రంప్ ఫైర్ కాగా.. ‘‘నువ్వు డిక్టేటర్ వి..” అంటూ ఆమె తిప్పికొట్టారు. ట్రంప్ గెలిస్తే అమెరికాను చైనాకు అమ్మేస్తారని ఆమె ఆరోపించగా.. కమల గెలిస్తే ఇజ్రాయెల్ రెండేండ్లలోనే మాయమవుతుందని అన్నారు. అబార్షన్ హక్కు, వలస విధానం, ఆర్థిక వ్యవస్థ వంటి పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు 90 నిమిషాలపాటు సాగిన ఈ డిబేట్లో చర్చించారు. అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనుండగా.. ట్రంప్, కమల మధ్య ఇదే తొలి, చివరి డిబేట్‌గా నిలవనుంది. ఈ డిబేట్లో ట్రంప్‌పై కమల కొంచెం పైచేయి సాధించారని అభిప్రాయపడింది. కాగా, తాను పాల్గొన్న డిబేట్లలో ఇదే అత్యుత్తమైనది అని ట్రంప్ కామెంట్ చేశారు.
ఇజ్రాయెల్, రష్యా యుద్ధంపై..
కమల ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తారని, ఆమె అమెరికా ప్రెసిడెంట్ అయితే రెండేండ్లలోనే ఇజ్రాయెల్ కనుమరుగు అవుతుందని ట్రంప్ విమర్శించారు. తాను ప్రెసిడెంట్‌గా ఉండి ఉంటే గాజా యుద్ధం జరిగేది కాదన్నారు. హారిస్ తండ్రి మార్క్సిస్ట్(ఎకనామిక్స్) ప్రొఫెసర్ అని, ఆమె కూడా మార్క్సిస్టే అని ఆరోపించారు. తాను ప్రెసిడెంట్‌గా ఉంటే ఉక్రెయిన్, రష్యా యుద్ధం 24 గంటల్లో ముగిసేదన్న ట్రంప్ కామెంట్లపై కమల ఘాటుగా స్పందించారు. ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఉంటే ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పుతిన్ కూర్చుని ఉండేవారని విమర్శించారు.
ఆర్థిక విధానాలపై..
చైనా విషయంలో తాను ప్రవేశపెట్టిన టారిఫ్స్, విధానాన్నే బైడెన్ సర్కారు ఫాలో అయిందన్న ట్రంప్ కామెంట్లను కమల ఖండించారు. ట్రంప్ హయాంలో అమెరికా చరిత్రలోనే అత్యధికంగా ట్రేడ్ డెఫిసిట్ ఏర్పడిందన్నారు. చైనా పాలసీ పేరుతో అమెరికన్లను ఆ దేశానికి అమ్మేశారని విమర్శించారు. ఎకానమీపై ట్రంప్ వద్ద ఎలాంటి ప్లాన్ లేదని కమల అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు ట్యాక్స్ తగ్గించి.. సామాన్య అమెరికన్లపై ధరల భారం మోపడమే ఆయనకు తెలుసన్నారు. తాను ప్రెసిడెంట్ అయితే గనక సామాన్య ప్రజలకే ప్రాధాన్యమిస్తానని, ఎకానమీ అభివృద్ధికి తన వద్ద మంచి విజన్ ఉందని కమల చెప్పారు.
అబార్షన్ హక్కు రద్దుపై..
ట్రంప్ అధ్యక్షుడు అయితే దేశవ్యాప్తంగా అబార్షన్ హక్కును రద్దు చేస్తారని కమల ఆరోపించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. జాతీయ స్థాయిలో అబార్షన్ హక్కును రద్దు చేయాల్సిన అవసరంలేదన్నారు. తాను గెలిస్తే అబార్షన్ హక్కురద్దు కోసం సంతకం చేయబోనన్నారు. బైడెన్, కమల సర్కారు పాలనలో నేరాలు గణనీయంగా పెరిగాయని ఆరోపించారు. దీనిపై హారిస్ స్పందిస్తూ.. జాతీయ భద్రత, ఎన్నికల్లో జోక్యం, ఆర్థిక నేరాలు, లైంగిక దాడి వంటి అభియోగాలపై డొనాల్డ్ ట్రంప్ విచారణను ఎదుర్కొన్నారని చెప్పారు. ఒబామా హయాంలో తెచ్చిన హెల్త్ కేర్ యాక్ట్ సబ్సిడీలు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ పైనే ఆధారపడ టం పెద్ద లోపమని ట్రంప్ విమర్శించారు. ఒకవేళ దీనికన్నా బెటర్ ప్లాన్ ఏమైనా ఉంటే ఈ చట్టాన్ని తాను రద్దు చేస్తానని ట్రంప్ చెప్పారు. దీనిపై కమలా హారిస్ స్పందిస్తూ.. హెల్త్ కేర్ యాక్ట్‌ను మరింత బలోపేతం చేస్తానని చెప్పారు.